ఉద్యోగులను బెదిరిస్తున్న ఆపిల్ సంస్థ.. అలా చేయకపోతే చర్యలు తప్పవంటూ వార్నింగ్..!
Apple News: అసలే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగోలేదు. కంపెనీలు సైతం ఉద్యోగులపై జాలి చూపించటం మానేశాయి. తమ వ్యాపార మనుగడ అన్నింటి కంటే చాలా ముఖ్యమని ఉద్యోగులకు తేల్చి చెబుతున్నాయి. ఈ క్రమంలో మాటవినని ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించటానికి అస్సలు సంకోచించటం లేదు.
అమెరికా దిగ్గజ మెుబైల్ ఉత్పత్తి దారు ఆపిల్ ఉద్యోగులకు తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది. కంపెనీ గత ఏడాదిలోనే వారానికి మూడు రోజుల పాటు ఆఫీసుల నుంచి ఉద్యోగులు పనిచేయాల్సిందేనని కరోనా తర్వాత బ్యాక్ టూ ఆఫీసు పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుత వ్యాపార అస్థిరతల్లో ఉత్పాదకతను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలో వారానికి మూడు రోజుల పాటు ఆఫీసులకు రాని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని యాజమాన్యం బెదిరిస్తోంది.

మాట వినని ఉద్యోగులపై చర్యలు తప్పవని ప్లాట్‌ఫార్మర్ మేనేజింగ్ ఎడిటర్ జో షిఫర్ బుధవారం ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా ఆపిల్ తన ఉద్యోగుల హాజరును బ్యాడ్జ్ రికార్డుల ద్వారా ట్రాక్ చేస్తోంది. దీనికి ముందు గత ఏడాది వేసవిలో కంపెనీలకు మూడు రోజుల పాలసీ గురించి వెల్లడించిన కంపెనీ.. సెప్టెంబర్ 5, 2022 నుంచి టీమ్ లీడర్లు చెప్పినట్లుగా విధులకు రావాల్సిందేనని తన కార్పొరేట్ ఉద్యోగులకు సమాచారం అందించింది.
కంపెనీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హైబ్రిడ్ వర్క్ విధానంలోకి మారుతోందని సీఈవో టిమ్ కుక్ మార్చి 2022లోనే ఉద్యోగులకు పంపిన ఒక మెమోలో స్పష్టం చేశారు. ఇది జరిగి దాదాపు ఏడాది గడుస్తుండగా.. కంపెనీ ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. సహ ఉద్యోగులతో కలిసి పనిచేసేందుకు ఇది మంచి వాతావరణాన్ని కల్పిస్తుందని అప్పట్లో టిమ్ కుక్ అభిప్రాపయపడ్డారు. అయితే అవసరమైన వారికి మాత్రం వెసులుబాటు కల్పించటం జరుగుతుందని అప్పట్లో ఆయన అన్నారు. తాజాగా హెచ్చరికలపై కంపెనీని ప్రముఖ వార్తా సంస్థ సంప్రదించినప్పపటికీ ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా స్పందించలేదు.


Click it and Unblock the Notifications