ఆపిల్ కొత్త 5G ఐఫోన్ లాంచింగ్ ఆలస్యం కావడం వల్ల కస్టమర్లు కొత్త ఫోన్లు కొనుగోలును పక్కన పెట్టారు. దీంతో ఆపిల్‌కు భారీ ఎత్తున నష్టం జరిగిందట. గత రెండేళ్లలో మొదటిసారి సెప్టెంబర్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల్లో క్షీణతను ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ స్టాక్స్ 5 శాతం మేర పడిపోయింది. అంటే ఫలితాల తర్వాత కొద్ది గంటల్లోనే ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు (రూ.7.4 లక్షల కోట్లు) హరించుకుపోయింది. ఆదాయాలు అంచనాలు మించినప్పటికీ సేల్స్ మాత్రం భారీగా తగ్గాయి. నిన్న స్టాక్స్ నష్టపోయినప్పటికీ ఈ రోజు మాత్రం 3 శాతానికి పైగా పుంజుకున్నాయి.

2013 తర్వాత ప్రతి ఏడాది కొత్త మోడల్
2013 నుండి ఆపిల్ ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో కొత్త మోడల్ ఐఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈసారి కూడా 5G ఐఫోన్‌ను సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తీసుకు వస్తుందని అదరూ భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. దీనిని అక్టోబర్ నెలలో మార్కెట్లోకి విడుదల చేసింది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలపై ఈ ప్రభావం భారీగా పడింది. సెప్టెంబర్‌లో ఫోన్ వస్తుందని భావించి చాలామంది వేచిచూశారు. కొనుగోళ్లను వాయిదా వేశారు. ఆపిల్ కూడా అక్టోబర్‌లో విడుదల చేయడంతో వినియోగదారులు మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విక్రయాలు 20.7 శాతానికి క్షీణించి 26.4 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

ఐనా భారీ లాభాలు
ఆపిల్‌కు చెందిన మాక్, ఎయిర్‌పాడ్స్ విక్రయాలు మాత్రం పెరిగాయ. దీంతో ఆదాయం, లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో 64.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 1 శాతం ఎక్కువ. విశ్లేషకుల అంచనాలు మించి ఒక్కో షేరుపై మంచి ఆదాయం వచ్చింది. కానీ ఐఫోన్ సమయానికి రాకపోవడంతో ఈ విభాగంలో మాత్రం విక్రయాలు పడిపోయాయి.

భారత్‌లో రికార్డ్ సేల్స్
చైనా మార్కెట్లో అమ్మకాలు 29 శాతం మేర తగ్గాయి. దీనిపై కంపెనీ సీఈవో టిమ్ కుక్ స్పందిస్తూ.. కొత్త ఐఫోన్ 12, ప్రో, మార్కెట్లోకి వచ్చాక ఆశాజనకంగా ఉంటుందని, ప్రస్తుత త్రైమాసికంలో వేగం పెరిగిందన్నారు. అమెరికా, యూరోప్, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో రికార్డ్ సేల్స్ నమోదయ్యాయని, భారత్‌లోను మంచి సేల్స్ నమోదయ్యాయని భారత్‌లో తమ ఆన్ లైన్ స్టోర్‌ను ప్రారంభించినందుకు బలమైన ఆదరణ కనిపిస్తోందన్నారు.


Click it and Unblock the Notifications