Anil Ambani: అదానీతో పోటీపడుతున్న అనిల్ అంబానీ.. అతిపెద్ద సోలార్ ప్లాంట్..
Reliance Power: దెబ్బతిన్న పులి శ్వాస నుంచి వచ్చే వేడి ఎలా ఉంటుందో ఇప్పుడు అనిల్ అంబానీ చూపిస్తున్నారు. పతనం తర్వాత దశాబ్ధాలుగా సైలెంట్‌గా ఉన్న అంబానీ ప్రస్తుతం వ్యాపారంలో పెద్ద అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే లిస్టెడ్ కంపెనీల రుణాలను చెల్లింపును వేగవంతం చేసిన అనిల్ అంబానీ వ్యాపారాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళుతూ మిగిలిన దేశీయ బిలియనీర్లతో పోటీపడటం ప్రారంభించారు.
ఈ క్రమంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ భూటాన్‌లో వ్యాపారం సంపాదించింది. అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రకటించింది. 1,270 మెగావాట్ల సౌర జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి భూటాన్ ప్రభుత్వ వాణిజ్య విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ తో భాగస్వామ్యాన్ని సైతం కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో వెల్లడించింది. ఈ వెంచర్ కోసం రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ అనే కొత్త కంపెనీని కూడా ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబడిన కంపెనీకి రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంయుక్త ప్రమోటర్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ రెన్యూవబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వ్యాపార అవకాశాలను అన్వేషిస్తోంది.

ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో 250 మెగావాట్ల చొప్పున రెండు దశల్లో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను నిర్మించనుంది. దీనిని రానున్న రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. అలాగే రన్-ఆఫ్-ది-రివర్ హైడ్రో ప్లాంట్ల కోసం భూటాన్ రాయితీ నమూనాలో పనిచేసే 770 మెగావాట్ల చమ్‌ఖర్చు-1 జలవిద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో సైతం కలిపి పనిచేయనున్నారు. కర్భన ఉద్ధారాలను తగ్గించేందుకు భూటాన్ చేస్తున్న ప్రయత్నాలకు రిలయన్స్ గ్రూప్ సహకారం అందించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే దీనికి సంబంధించిన భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. కాగా రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ భూటాన్‌లో స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, మీటరింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడంపై కూడా పని చేస్తోంది.
రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్, డ్రక్ హోల్డింగ్ మధ్య భాగస్వామ్యం గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్ రంగాల్లో రెండు సంస్థల బలాన్ని పెంచుతుందని డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన ఉజ్వల్ దీప్ దహల్ అన్నారు. తాజా పరిణామాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు తమ బుల్ జోరును నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాయి. రిలయన్స్ పవర్ స్టాక్ నేడు 5 శాతం పెరిగి ఎన్ఎస్ఈలో రూ.53.64 వద్ద నేడు ట్రేడవుతున్నాయి. ఇదే క్రమంలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 10.12 గంటల సమయంలో 1.73 శాతం లాభపడి రూ.337.75 వద్ద ఒక్కో షేరు మార్కెట్లో కొనసాగుతోంది. డిసెంబర్ 2018 తర్వాత ఇప్పటి వరకు రిలయన్స్ ఇన్ ఫ్రా స్టాక్ దాదాపు 60 శాతం పెరుగుదలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications