Anil Ambani: సెబీ బ్యాన్‌పై రంగంలోకి దిగిన అనిల్ అంబానీ.. నెక్ట్స్ ప్లాన్ ఇదే..
Ban On Anil Ambani: గతవారం ముందు వరకు వరుసగా పాజిటివ్ వార్తలతో ఒకప్పటి బిలియనీర్ అనిల్ అంబానీ వార్తల్లో నిలిచారు. అయితే ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చర్యలతో వార్తల్లో అంబానీ సోదరుడి పేరు మారుమోగుతోంది.
ఇన్వెస్టర్లలో పెద్ద గందరగోళానికి దారితీసిన ఈ వ్యవహారంపై అనిల్ అంబానీ స్పందిచారు. సెబీ విధించిన జరిమానా, నిషేధంపై ముందుకు వెళ్లేందుకు తగిన లీగల్ ఆప్షన్ పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి గతంలో రిలయన్స్ క్యాపిటల్ సబ్సిడరీ సంస్థగా ఉన్న రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలో భారీగా నిధుల మళ్లింపు రుణాల మాటున జరిగిందని గుర్తించిన సెబీ అనిల్ అంబానీతో పాటు అనేక మంది గత కంపెనీ ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంలో మెుత్తం అంబానీతో పాటు మరో 24 మందిపై రూ.624 కోట్లు ఫైన్ వేసింది.

అలాగే ఫిబ్రవరి 11, 2022 నాటి సెబీ మధ్యంతర ఉత్తర్వుకు అనుగుణంగా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ బోర్డులకు రాజీనామా చేసినట్లు అంబానీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే సెబీ ఆగస్టు 22 నాటి తుది ఉత్తర్వును అనిల్ అంబానీ సమీక్షిస్తున్నారని, న్యాయపరంగా సలహా మేరకు తగిన చర్యలు తీసుకుంటారని ప్రతినిధి వెల్లడించారు. ఇదే వ్యవహారంపై రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పందిస్తూ సెబీ కంపెనీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఫిబ్రవరి 11, 2022 నాటి మధ్యంతర ఉత్తర్వు ప్రకారం రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ల బోర్డు నుంచి అనిల్ అంబానీ ఇప్పటికే రాజీనామా చేశారని స్పష్టం చేసింది.
ఇదే తరహాలో రిలయన్స్ పవర్ సైతం ఒక ప్రకటన విడుదల చేస్తూ కంపెనీపై సెబీ చర్యల ప్రభావం లేదని వెల్లడించింది. అయితే సెబీ చర్యలు అనిల్ అంబానీ లిస్టెడ్ కంపెనీల్లో కొంత అలజడిని సృష్టించాయి. భయాందోళనకు గురైన పెట్టుబడిదారులు వాటాల విక్రయానికి సైతం దిగారు. మెుత్తానికి అనిల్ అంబానీ చాలా కాలం తర్వాత తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతున్న సమయంలో సెబీ చర్యలు మళ్లీ కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.


Click it and Unblock the Notifications