Reliance Naval: చాలా కాలంగా దేశీయ మార్కెట్లలో, వ్యాపార వార్తల్లో అనిల్ అంబానీ కనుమరుగయ్యారు. ఆయన కంపెనీలు వరుసగా విఫలం కావటంతో దాదాపు దివాలా స్థితికి చేరుకున్నారు. అయితే ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో కనిపించినప్పటికీ సర్వసాధారణంగా ఉన్నారు.
తాజాగా ఆయనకు చెందిన రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. భారీ అప్పుల కారణంగా అనిల్ అంబానీకి చెందిన చాలా లిస్టెడ్ కంపెనీలు దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని చేతులు మారేందుకు కొత్త యజమానులను కనుగొన్నాయి. ఇటీవల అనిల్ కి చెందిన కీలక ఫైనాన్స్ వ్యాపారం రిలయన్స్ క్యాపిటల్‌ను హిందూజా గ్రూప్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఆయన గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ కొనుగోలుపై స్వాన్ ఎనర్జీ ఒక ముఖ్యమైన సమాచారం అందించింది.

రిలయన్స్ నావల్ & ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీలో ప్రస్తుతం వాటాదారులు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు ప్రతి 275 ఈక్విటీ షేర్‌లకు ఒక షేర్ జారీ ప్రక్రియ పూర్తయిందని స్వాన్ ఎనర్జీ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ప్రక్రియను NCLT అహ్మదాబాద్ బెంచ్ డిసెంబర్ 23, 2022న ఆదేశించింది. ఇప్పుడు దీనితో రిలయన్స్ నావల్ & ఇంజనీరింగ్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డ్యూయల్ లిస్టింగ్ ఆమోదం పొందే ప్రక్రియలో ఉంది. లిస్టింగ్ ప్రక్రియ స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం కోసం వేచి ఉందని స్వాన్ ఎనర్జీ తెలిపింది.
చాలా కాలంగా రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షేర్లలో ట్రేడింగ్ చాలా కాలంగా మూసివేయబడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 2010లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.120గా ఉంది. అయితే తర్వాతి కాలంలో భారీ నష్టాలను చవిచూసి మార్చి 2023 నాటికి స్టాక్ ధర 99 శాతం తగ్గి రూ.1.61 వద్దకు చేరుకుంది. కంపెనీ షేర్లలో మెజారిటీ వాటాదారులుగా సాధారణ పబ్లిక్ ఉంది. ఇదే క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ 7.93 శాతం లేదా 58,46,5899 షేర్లను కలిగి ఉంది.
కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కింద అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కోసం హేజెల్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ బిడ్‌ను NCLT ఆమోదించింది. Hazel Infra Limited అనేది స్పెషల్ పర్పస్ వెహికల్. దీనిలో స్వాన్ ఎనర్జీ 74% వాటాను, హేజెల్ మెర్కంటైల్ లిమిటెడ్ 26% వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ డీల్ విలువ రూ.2,100 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications