Anil Ambani: అనిల్ అంబానీకి భారీ ఊరట.. ఆర్బిట్రేషన్ కేసులో చట్టపరమైన విజయం..
Anil Ambani: అంబానీ సోదరుడు అనిల్ చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన అనేక వ్యాపారాలు ఇప్పటికే మూతపడటం లేదా వేరొకరికి విక్రయించటం జరిగింది.
రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూపులో భాగమైన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్టర్చర్‌కు భారీ ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దామోదర్ వ్యాలీ కార్ప్(DVC)కి వ్యతిరేకంగా జరిగిన ఆర్బిట్రేషన్ కేసులో కలకత్తా హైకోర్టు అనిల్ అంబానీ సంస్థకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. దీంతో రూ.1,354 కోట్ల ఆర్బిట్రేషన్ కేసులో అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చట్టపరమైన విజయం లభించింది.

పశ్చిమ బెంగాల్‌లోని రఘునాథ్‌పూర్‌లో థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించడానికి రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.3,750 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకున్నప్పటి ఈ వివాదం ఒక దశాబ్ద కాలం కొనసాగింది. దురదృష్టవశాత్తు, ప్రాజెక్ట్ అనేక వివాదాలు, జాప్యాలను ఎదుర్కొంది. దీంతో DVC రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి నష్టపరిహారాన్ని కోరింది. అయితే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుకు వ్యతిరేకించింది. దీంతో విషయం మధ్యవర్తిత్వానికి దారితీసింది. చివరకు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పు అనిల్ అంబానీ సంస్థకు అండగా నిలిచింది.
అనేక దఫాల న్యాయపోరాటాల తర్వాత కలకత్తా హైకోర్టు సూచించిన విధంగా DVC నుంచి మిగిలిన రూ.405 కోట్లను రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్వీకరించే దశలో ఉంది. రిలయన్స్ అధికారిక ప్రకటన ప్రకారం మొత్తం రూ.1,354 కోట్లలో బ్యాంక్ గ్యారెంటీలు, ఇప్పటి వరకు వడ్డీని పొందనుంది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం తీర్పును పరిశీలిస్తోంది. తీర్పుపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మెుత్తానికి చాలా కాలం తర్వాత అనిల్ అంబానీ కంపెనీ పెద్ద విజయాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications