Anil Ambani: ఒక పక్క ముఖేష్ అంబానీ కొత్త వ్యాపారాలను కొనుగోలు చేస్తూ విస్తరణను వేగవంతం చేయగా సోదరుడు మెల్లగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆస్తులు కోల్పోయిన అనిల్ అంబానీని ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. తాజాగా అనీల్ అంబానీ కంపెనీ అదానీ కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ కోర్టుకు వెళ్లటం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

భారీ పరిహారం కావాలంటూ..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌పై 1.7 బిలియన్ డాలర్లు అంటే రూ.13,400 కోట్ల మధ్యవర్తిత్వ దావాను వేసింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన ముంబై విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని విక్రయించడానికి అదానీ ట్రాన్స్‌మిషన్ ఒప్పందంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు నష్టపరిహారం కోరుతూ ఆరోపించింది.

రిలయన్స్ ఫిర్యాదు..
రిలయన్స్ ఫిర్యాదులో డిసెంబర్ 2017 నాటి ఒప్పందంలోని నిబంధనల ఉల్లంఘనలను ఉదహరించింది. ముంబై సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ముందు అనిల్ అంబానీ కంపెనీ అదానీని చుట్టుముట్టింది. అయితే.. దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి వివరణాత్మక సమాచారం ఇవ్వలేదు. ఈ విషయంలో ఇప్పటి వరకు అదానీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రిలయన్స్ ఇన్‌ఫ్రా కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు ఈ మెుత్తం డీల్ విలువ అప్పట్లో రూ.18,800 కోట్లగా ఉంది.

షేర్లపై ప్రభావితం..
ప్రస్తుతం అదానీ ట్రాన్స్‌మిషన్ షేరు ధర సాయంత్రం ముగిసే సమయానికి రూ.3,980గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.4,45,000 కోట్లుగా ఉంది. ఈ ఒక్కరోజే షేర్ రూ.55 వరకు పెరిగింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్ మార్కెట్ ముగిసే సమయానికి 7 శాతం పెరిగి రూ.173.80 వద్ద ఉంది.

MCIA ప్రకారం..
ముంబై ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (MCIA) అనేది దేశీయ, అంతర్జాతీయ వ్యాపార, న్యాయ సంఘాల మధ్య ఉమ్మడి చొరవతో స్థాపించబడిన దేశంలో తొలి మధ్యవర్తిత్వ సంస్థ. ప్రస్తుతం రెండు కంపెనీలు న్యాయస్థానంలో నేరుగా పోరాడనున్నాయి.


Click it and Unblock the Notifications