భారత సెమీ కండక్టర్ హబ్‌గా తిరుపతి.. 5 వేల ఎకరాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి కేంద్రం నయా ప్లాన్..
Semiconductor Hub in Tirupati: భారతదేశాన్ని ప్రపంచ చిప్ తయారీ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ రెండవ దశ (ISM సెమికాన్ 2.0)కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0ను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (GO) జారీ చేసినట్లు బుధవారం విడుదలైన ప్రకటనలో వెల్లడించింది. సవరించిన పాలసీ ప్రకారం, రాష్ట్రంలో ఏర్పాటయ్యే సిలికాన్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే ఫ్యాబ్‌లు మరియు చిప్ ప్యాకేజింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అందించే మూలధన మద్దతుకు సమానంగా (100 శాతం) రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను సమకూరుస్తుంది.
ఈ కొత్త సవరణతో సెమికాన్ 2.0 కింద ఆమోదం పొందే సిలికాన్ ఫ్యాబ్ ప్రాజెక్టులకు అర్హత కలిగిన మూలధన వ్యయంలో ఏకంగా 80 శాతం ఉమ్మడి ఆర్థిక సహాయం లభించనుంది. ఇందులో 40 శాతం కేంద్ర ప్రభుత్వం నుండి, మరో 40 శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అందుతాయి. అదేవిధంగా కాంపౌండ్ సెమీకండక్టర్, ఫోటోనిక్స్, సెన్సార్, డిస్క్రీట్, డిస్‌ప్లే ఫ్యాబ్‌లు మరియు అధునాతన ప్యాకేజింగ్ యూనిట్లకు 70 శాతం, లెగసీ ప్యాకేజింగ్ యూనిట్లకు 50 శాతం చొప్పున ఉమ్మడి రాయితీలు లభిస్తాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న 80 శాతం మద్దతు దేశంలోనే అత్యధికం కావడం విశేషం-ప్రస్తుతం ఒడిశా (65%), తమిళనాడు (65%), ఉత్తరప్రదేశ్ (60%), మధ్యప్రదేశ్ (60%), గుజరాత్ (56%) రాష్ట్రాలు ఇస్తున్న ప్రోత్సాహకాల కంటే ఇది ఎంతో ఎక్కువ.

ఈ సందర్భంగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. డిజైన్ నుండి ఫ్యాబ్ మరియు ప్యాకేజింగ్ వరకు భారతదేశ చిప్ తయారీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయికి సమానంగా రాష్ట్రం కూడా తోడ్పడటం ద్వారా దేశంలో మరెక్కడా లేనంత సులభంగా, తక్కువ ఖర్చుతో ఫ్యాబ్‌లను నిర్మించే వాతావరణాన్ని కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
సవరించిన విధానం మొత్తం 10 సెమికాన్ 2.0 వర్గాలను డిజైన్, యంత్రాలు-మెటీరియల్స్, ఫ్యాబ్స్, ప్యాకేజింగ్, పరిశోధన-అభివృద్ధి (R&D), మరియు టాలెంట్ అనే ఆరు మూలస్తంభాల క్రిందకు తీసుకొచ్చింది. అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP), అవుట్‌సోర్స్డ్ అసెంబ్లీ, టెస్ట్ (OSAT) యూనిట్లకు కేంద్ర సహాయానికి సమానంగా 100 శాతం రాష్ట్ర మద్దతు లభిస్తుంది. అలాగే R&D మరియు ప్రతిభా ప్రాజెక్టులకు రాష్ట్రం 25 శాతం అందిస్తుండగా, కేంద్ర-రాష్ట్ర సంయుక్త మద్దతు 75 శాతానికి పరిమితం చేశారు. స్థిర మూలధన పెట్టుబడిలో రాష్ట్ర ప్రోత్సాహకాలు 50 శాతానికి, అన్ని వనరుల నుండి వచ్చే మొత్తం మద్దతు 90 శాతానికి పరిమితం కాగా, కేంద్రం నిధులు విడుదల చేసిన ప్రతి విడత తర్వాత రాష్ట్ర వాటాను విడుదల చేస్తారు.
మరోవైపు, తిరుపతి సమీపంలో సుమారు 5,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పెట్టుబడిదారుల నేతృత్వంలోని బోర్డు, గరిష్ఠంగా ముగ్గురు ప్రభుత్వ నామినీలతో కూడిన పబ్లిక్-ప్రైవేట్ కంపెనీ దీనిని నిర్వహిస్తుంది. ఈ క్లస్టర్‌లో ఉమ్మడి పారిశ్రామిక క్లీన్‌రూమ్‌లు, నిరంతరాయ హై-వోల్టేజ్ విద్యుత్, అత్యంత స్వచ్ఛమైన నీరు, ప్రత్యేక వాయువులు, నీటి రీసైక్లింగ్, టెస్టింగ్ ల్యాబ్‌లు, లాజిస్టిక్స్ సదుపాయాలు ఉంటాయి.
పెట్టుబడిదారులకు సింగిల్ విండో విధానంలో సేవలందించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన పర్యవేక్షణ మండలి, సీఈఓ నేతృత్వంలోని నిపుణుల కమిటీతో ఏపీ సెమీకండక్టర్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (APSGIC) పనిచేస్తుంది. అదనంగా, తొలుత ఐఐటీ-తిరుపతి నుండి ఫోటోనిక్స్ ప్రధాన లక్ష్యంగా పనిచేసే లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ AP-SRIC ను, అలాగే పరిశ్రమల భాగస్వామ్యంతో నడిచే శిక్షణా కేంద్రం AP-STCCను ఏర్పాటు చేయనున్నారు.. ఇందులో భాగంగా కంపెనీలకు ఆరు నెలల పాటు ప్రతి శిక్షణార్థికి నెలకు రూ. 10,000 చొప్పున శిక్షణ సబ్సిడీ కూడా అందించనున్నారు.


Click it and Unblock the Notifications
