ఉల్లి దెబ్బ, జగన్ ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం: ఆధార్ ఉండాలి..
ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒడిశా వంటి రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ.100కు చేరుకుంది. దాదాపు ప్రతిచోట ఉల్లి కిలో రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. ఉల్లిని కొనలేని పరిస్థితులు ఉన్నాయి. నెల నుంచి రెండు నెలల వ్యవధిలోనే దీని ధర రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉల్లి రైతులు మంచి లాభాలను చూస్తున్నారు. అయితే పంట నష్టపోయిన రైతులకు మాత్రం ఇది బ్యాడ్ న్యూస్. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో ధరలు అంతకంతకు పెరిగాయి.

జగన్ ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం
ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు బజార్లలో కిలో ధర రూ.25కు విక్రయిస్తున్నారు. ఆదివారం ఇది అన్ని రైతు బజార్లలో అందుబాటులోకి వస్తోంది. ఏపీలో మొత్తం 85 రైతు బజార్లు ఉన్నాయి. బయట ధర రూ.80కి పైగా ఉంది. రైతు బజార్లలో రూ.25కే విక్రయిస్తుండటంతో ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది. అన్ని రైతు బజార్లలో అందుబాటులోకి వచ్చాక మరింత భారం కానుంది.

రైతుల నుంచి కొనుగోలు చేసి...
కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిని మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది. దీనిని అన్నిచోట్లకి (రైతుబజార్లకు) సరఫరా చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో రైతుల నుంచి కిలో రూ.48 నుంచి రూ.55కు మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది. దీనిని రైతు బజార్లకు తరలించి విక్రయిస్తున్నారు.

రైతు బజార్లలో ఆధార్
ఏపీలోని రైతు బజార్లలో ఆధార్ కార్డును చూపిస్తేనే ఉల్లిని రూ.25కు విక్రయిస్తున్నారట. ఆధార్ లేకుంటే బహిరంగ మార్కెట్లో ఉన్న రూ.80 నుంచి రూ.100కు కొనుగోలు చేయాలి. ఆధార్ కార్డుతో కిలో రూ.25కు విక్రయిస్తున్నారు.

వెంటనే ఖాళీ...
కిలో ఉల్లిని రైతు బజార్లలో రూ.25కే పంపిణీ చేస్తుండటంతో సరుకు వెంట వెంటనే ఖాళీ అవుతోంది. వారం మొత్తం కాకుండా మూడు నాలుగు రోజులు విక్రయిస్తున్నారట. అయితే రూ.25కే కిలో ఇచ్చే ఉల్లి గంటల్లోపు ఖాళీ అవుతోంది. శుక్రవారం కర్నూలు మార్కెట్లో క్వింటాల్ ఉల్లి ఏకంగా రూ.7వేలకు పైగా పలికింది.


Click it and Unblock the Notifications