బంగారానికి అక్షయ తృతీయ రోజు భారీ డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా కొనుగోళ్లు దాదాపు 95 శాతం క్షీణించాయని ఆభరణాల పరిశ్రమల సమాఖ్య తెలిపింది. కొన్ని దుకాణాలు ఆన్ లైన్ ద్వారా విక్రయించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5 శాతం విక్రయాలు జరిగాయి. ఈ అక్షయ తృతీయ నాడు కొనుగోళ్లు తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

లాక్ డౌన్, దుకాణాల మూత
ఈ ఆక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోళ్లు తగ్గడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో అన్ని వ్యాపార సంస్థలతో పాటు బంగారం దుకాణాలు కూడా క్లోజ్ ఉన్నాయి. దీంతో వ్యాపారం తగ్గింది. సాధారణంగా ఎక్కువమంది దగ్గరలోని లేదా తమకు తెలిసిన దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. లాక్ డౌన్ కారణంగా దుకాణాలు మూతబడటంతో పాటు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి.

ఉద్యోగాల కోత, శాలరీ కట్, చేతిలో డబ్బుల్లేకపోవడం
బంగారం కొనుగోళ్లు తగ్గడానికి మరో ప్రధాన కారణం ప్రజల చేతిలో డబ్బులు తగ్గడం లేదా లాక్ డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో చేతిలో నగదు ఉంచుకోవడం మంచిది అని భావించడం. అలాగే, చాలామందికి ఉద్యోగాలు పోయాయి. వేతనం కట్ చేసి ఇస్తున్నారు. ఇవన్నీ బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపాయి. సగటు వ్యక్తి ఆర్థిక పరిస్థితి బంగారం కొనుగోళ్లపై పడింది. డబ్బులు ఖర్చు చేయకపోవడమే మంచిదని చాలామంది భావించారు.

బంగారం ధర పెరుగుదల
సమీప భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, పసిడిపై ఇన్వెస్ట్ చేయడం మంచిదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కానీ బంగారం ధరలు ఈ కొద్ది రోజుల్లోనే ఏకంగా 40 శాతం నుండి 50 శాతం మధ్య పెరిగాయి. కొనుగోళ్లు తగ్గడానికి ఇది కూడా కారణం. బంగారం ధరల పెరుగుదల కొనుగోలుకు దూరం చేసింది.

ఆన్ లైన్ కొనుగోలుకు దూరం
మరికొంతమందికి బంగారం కొనుగోలు చేయాలని భావించినప్పటికీ కారణమేదైనా డిజిటల్ మాధ్యమాల కొనుగోలు చేయడానికి వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ బంగారు ఆభరణాలను క్షుణ్ణంగా పరిశీలించి తమ శరీరంపై అలంకరించుకొని సంతృప్తి చెందిన తర్వాతే కొనడానికి ఇష్టపడుతున్నారని చెబుతున్నారు. ఆందుకే ఆన్ లైన్ కొనుగోళ్లు మాత్రమే 5 శాతం జరిగాయని చెబుతున్నారు. పెద్ద పెద్ద బంగారం వ్యాపార సంస్థలు మంచి ఆఫర్లు ఇచ్చాయి. కానీ కొనుగోళ్లు ఆశించినట్లుగా లేవు.

ఎప్పుడు కుదుటపడుతుంది
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మే ఆఖరుకు లేదా జూన్ నెలలో పరిస్థితి కుదుట పడే అవకాశాలు ఉన్నాయని, దీపావళి నాటికి పసిడికి గిరాకీ పెరుగుతుందని AIGJDC చైర్మన్ అనంత పద్మనాభన్ అన్నారు.గత ఏడాదితో పోలిస్తే ఆన్ లైన్ అమ్మకాలు కూడా కేవలం 5 నుండి పది శాతం కూడా లేవన్ ఆభరణాల వర్తకులు చెబుతున్నారు. గోల్డ్ వ్యాపారుల ఆన్ లైన్ ఆలోచనలు కలిసి రాలేదని, అమ్మకాలు తుడిచి పెట్టుకుపోయాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications