కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2020-21 ఆర్థిక సంవత్సరంలో దారుణంగా క్షీణించనుంది. 2021-22లో కాస్త కోలుకుంటుంది. 2019-20తో పోలిస్తే ఈ రెండేళ్ల పాటు ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడనుంది. ప్రస్తుతం క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఆర్థిక విధానాలతో పాటు రాజకీయ సహకారం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు. గత వారం ప్రారంభంలో గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్టర్ నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం ప్రతికూలత నమోదు చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పుంజుకుంటుందని తెలిపింది.

జీడీపీ తగ్గితే... ఆదాయం తగ్గి, ఉద్యోగాలు పోతాయి
ప్రపంచ దేశాలతో పాటు భారత జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం భారీగా క్షీణిస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం కాస్త కోలుకుంటుందని ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. జీడీపీ తగ్గిపోవడం అంటే ఓ విధంగా ఆదాయాలు తగ్గిపోతాయి. ఉద్యోగాలు పోతాయి. ఏదేమైనా ఈ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సరైన పాలసీలు రూపొందించాలి. అప్పుడే త్వరగా కోలుకునే పరిస్థితి ఉంటుంది. మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక ప్యాకేజీపై అంతర్జాతీయ సంస్థలు ప్రశంసలు కురిపించాయి.

మిగతా రంగాలపై తీవ్ర ప్రభావం
ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మాత్రమే క్షీణించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం, వ్యవసాయం కలిపి 2019-20లో గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వాటా దాదాపు 30 శాతంగా ఉంది. మిగతా రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని భావించవచ్చు. రాబోయే రెండు మూడేళ్లలో వ్యవసాయ రంగంలో వృద్ధి సాధారణ సగటు కంటే పెరగనుంది.

నిర్మాణ రంగాన్ని కాపాడితే ఉద్యోగాలు కాపాడవచ్చు
ఉదాహరణకు 2018-19లో గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీఏవీ)లో నిర్మాణరంగం వాటా 8 శాతంగా ఉంది. కానీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) డేటా ప్రకారం ఉపాధి 12 శాతంగా ఉంది. 2018-19లో ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ వంటి రంగాల వాటా 22 సాతంగా ఉంది. వీటిలో ఎంప్లాయిమెంట్ షేర్ 3.4 శాతం మాత్రమే. అంటే ఫైనాన్స్ కంటే నిర్మాణ రంగం ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న రంగం. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగం నష్టపోతే ఉపాధి కల్పన కూడా అంతేస్థాయిలో నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగానికి చేయూతనివ్వడం ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కాపాడగలుగుతాము. ముఖ్యంగా పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఆర్థిక సహకారం అలా ఇవ్వాలి
ఆర్థిక ప్యాకేజీ లేదా ఆర్థిక సహకారం అందివ్వడం అంటే ఎక్కుమంది ఆధారపడిన రంగాలను ఆదుకోవడమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయం, ప్రభుత్వరంగాలను పక్కన పెడితే 2018-19 ప్రకారం నిర్మాణ రంగం, వాణిజ్యం, హోటల్స్, ట్రాన్సుపోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఎక్కువగా ఉపాధి, ఉద్యోగాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, అలాగే ఆయా రాష్ట్రాలు ఎక్కువ ఉపాధి కలిగిన ఆయా రంగాలను ఆదుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications