అమెజాన్ లేఆప్స్.. 16 వేల మంది ఉద్యోగులు బయటకు.. 2026 చివరి నాటికి 30 వేల మంది ఉద్యోగులు టార్గెట్..
గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ ఈ వారంలో మరో పెద్ద రౌండ్ భారీ ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. జనవరి 27న కంపెనీ కొత్త రౌండ్ లేఆఫ్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చర్య అమెజాన్ చేపట్టిన విస్తృత పునర్నిర్మాణ (restructuring) ప్రణాళికలో భాగంగా భావిస్తున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం.. 2026 మధ్య నాటికి మొత్తం 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈసారి జరిగే ఉద్యోగ కోతలు భౌగోళికంగా విస్తృత ప్రభావాన్ని చూపుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా భారతదేశానికి చెందిన ఉద్యోగులు గతంతో పోలిస్తే ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్లైండ్, రెడ్డిట్ వంటి ఉద్యోగి చర్చా వేదికల్లో వెలువడిన సమాచారం ప్రకారం.. భారతదేశంలోని అమెజాన్ కార్పొరేట్ టీమ్స్‌పై ఈ లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఉద్యోగులే చెబుతున్నారు.

రాబోయే ఉద్యోగ కోతలు అమెజాన్‌లోని అనేక కీలక విభాగాలను ప్రభావితం చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా Amazon Web Services (AWS), Prime Video, Retail Operations, People Experience and Technology (PXT), అమెజాన్ అంతర్గత HR విభాగంలోని ఉద్యోగులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఈ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అధిక ప్రమాదంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో ఉన్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన టెక్ హబ్‌లలోని కార్పొరేట్ జట్లు ఈసారి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అమెజాన్ 2025 చివరి నాటికి విస్తృత పునర్నిర్మాణ ప్రణాళికను ప్రారంభించింది. ఈ ప్రణాళిక తొలి దశలోనే కంపెనీ 2025 అక్టోబర్‌లో దాదాపు 14 వేల వైట్-కాలర్ ఉద్యోగాలను తొలగించింది. ఇప్పుడు రెండవ దశలో మరో 16 వేల ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉందని అంచనా.. అలా జరిగితే మొత్తం లేఆఫ్స్ సంఖ్య 30 వేలకు కు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది జరిగితే.. 2022-2023 మధ్యకాలంలో అమెజాన్ చేపట్టిన 27 వేల ఉద్యోగ కోతలను కూడా మించిపోయిన అతిపెద్ద లేఆఫ్ డ్రైవ్ గా ఇది నిలుస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.57 మిలియన్ ఉద్యోగులను నియమించుకున్నప్పటికీ.. ఈ కోతలు ప్రధానంగా దాని సుమారు 3.5 లక్షల కార్పొరేట్ (వైట్-కాలర్) వర్క్‌ఫోర్స్‌పై కేంద్రీకృతమై ఉన్నాయి.
రెడ్డిట్, బ్లైండ్, లింక్డ్ఇన్ వంటి వేదికలలో ఉద్యోగులు చేసిన పోస్టుల ప్రకారం.. జనవరి 27తో ప్రారంభమయ్యే వారం నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగులు తమ మేనేజర్లు, సీనియర్ లీడర్లు ఇప్పటికే ఈ కోతలపై సంకేతాలు ఇచ్చారని తెలిపారు. అలాగే ప్రస్తుతం Performance Improvement Plans (PIP)లో ఉన్న ఉద్యోగులకు ముందుగానే సమాచారం అందే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
కొన్ని నివేదికల ప్రకారం.. ఇప్పటికే 1,000 నుంచి 2,000 మంది ఉద్యోగులకు ముందస్తు హెచ్చరిక నోటీసులు అందినట్లు సమాచారం. అమెరికా చట్టాల ప్రకారం. భారీ ఉద్యోగ కోతలకు ముందు ఇలాంటి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, అమెజాన్ ఇప్పటివరకు లేఆఫ్స్ సమయం లేదా పరిమాణంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తొలగింపుల వెనుక అసలు కారణాన్ని చూసినట్లయితే..అమెజాన్ CEO ఆండీ జాస్సీ ప్రకారం, ఈ ఉద్యోగ కోతలు తాత్కాలిక ఖర్చు తగ్గింపుల కోసం కాదని, కంపెనీ నిర్మాణాన్ని సరిచేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవి పూర్తిగా ఆర్థిక మాంద్యం లేదా కేవలం AI కారణంగానే జరుగుతున్నవి కావని, అయితే సంస్థలో పెరిగిపోయిన బ్యూరోక్రసీ, బహుళ-స్థాయి మేనేజ్‌మెంట్‌ను తగ్గించడమే ఉద్దేశమని ఆయన వివరించారు.
ప్రస్తుతం అమెజాన్ పునర్నిర్మాణ వ్యూహంలో కృత్రిమ మేధస్సు (AI) కీలక పాత్ర పోషిస్తోంది. HR, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో కంపెనీ దూకుడుగా ఆటోమేషన్‌ను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఉత్పత్తులు లేదా సేవలను నేరుగా నిర్మించని నిర్వహణ, పరిపాలనా పాత్రలను తగ్గించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications