ఐటీ ఉద్యోగులకు మళ్ళీ షాక్.. అమేజాన్‌లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత? అసలు ఏం జరుగుతోంది?
ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. కొత్త ఏడాదిలో అమేజాన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత రెండు మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్, టెక్ రంగాల్లో లే ఆఫ్స్ (layoffs) భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అమేజాన్ తన కార్పొరేట్ విభాగంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వేల మందిని ఇంటికి పంపిన ఈ సంస్థ.. 2026 ప్రారంభంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎందుకు ఈ తొలగింపులు?
అమెజాన్ తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి అలాగే సంస్థలోని 'బ్యూరోక్రసీ' (అదనపు మేనేజ్‌మెంట్ పొరలను) తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే దాదాపు 14,000 పోస్టులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఈ సంస్థ, ఇప్పుడు మరిన్ని విభాగాల్లో కోతలు విధించనుంది. కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ వ్యూహం ప్రకారం.. ఒక కంపెనీ స్టార్టప్ లాగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటే.. మధ్యలో ఉండే మేనేజర్లు మరియు అదనపు సిబ్బంది తగ్గడం అవసరమని భావిస్తున్నారు. అందుకే అదనపు లేయర్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తించి మరీ ఈ అమెజాన్ లే ఆఫ్స్ (Amazon layoffs) చేపడుతున్నారు.
వచ్చే వారమే అమలు?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ వచ్చే వారం నుంచే ప్రారంభం కావచ్చు. సాధారణంగా హాలిడే సీజన్ ముగిసిన తర్వాత కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. అమేజాన్‌లో సుమారు 15 లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్నప్పటికీ.. వారిలో ఎక్కువ మంది వేర్‌హౌస్ లలో పని చేస్తారు. కానీ, ఈసారి కోత పడబోయేది మాత్రం సుమారు 3.5 లక్షల మంది ఉండే కార్పొరేట్ సెక్షన్ లోనే. ఇది సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, మేనేజర్లు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.
ఐటీ రంగానికి హెచ్చరిక సంకేతమా?
2022, 2023లో అమేజాన్ దాదాపు 27,000 మందిని తొలగించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ అదే బాటలో వేల మందిని తొలగించడం చూస్తుంటే, టెక్ రంగంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని అర్థమవుతోంది. కేవలం ఖర్చుల తగ్గింపు మాత్రమే కాకుండా, కృత్రిమ మేధ (Artificial Intelligence) వాడకం పెరగడం కూడా ఈ తొలగింపులకు ఒక కారణం కావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?
కంపెనీ ఈ విషయంలో అధికారికంగా స్పందించనప్పటికీ, లోలోపల మాత్రం ఉద్యోగుల మధ్య తీవ్ర ఆందోళన మొదలైంది. ఏ క్షణంలో ఏ మెయిల్ వస్తుందో అని భయపడుతున్నారు. అయితే, పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఈ కోతలు ఉంటాయని యాజమాన్యం సంకేతాలిస్తోంది. మొత్తానికి, టెక్ రంగంలో మళ్ళీ 'పింక్ స్లిప్' ల కాలం మొదలైనట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications