భారత్‌లో అమెజాన్ 37 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. లక్షల ఉద్యోగాలు ఈ రంగాల్లోనే
అమెజాన్ భారత మార్కెట్‌పై తన దృష్టిని మరింతగా కేంద్రీకరించింది. 2030 నాటికి దేశంలోకి మొత్తం 35 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పంపనున్నట్లు ఒక భారీ ప్రణాళికను ప్రకటించింది. కృత్రిమ మేధస్సు (AI), లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో తన సామర్థ్యాన్ని పెంచుకోవడమే ఈ పెట్టుబడి ప్రధాన ఉద్దేశ్యం. 2010లో భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి కంపెనీ ఇప్పటికే $40 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.
తాజాగా ప్రకటించిన ఈ కొత్త మూలధనం ఆ సంఖ్యను మరింత చరిత్రాత్మక స్థాయికి తీసుకెళ్తోంది. ఈ ప్రణాళిక అమలు పూర్తి అయితే, భారతదేశం అమెజాన్‌కు అమెరికా వెలుపల ఉన్న అతిపెద్ద ప్రాధాన్య మార్కెట్‌గా నిలపడమేకాకుండా.. దేశీయ రిటైల్, టెక్నాలజీ, చిన్న వ్యాపార వ్యవస్థలను బలంగా మార్చే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

అమెజాన్ ఇచ్చిన వివరాల ప్రకారం.. 2030 నాటికి సంస్థ భారతదేశంలో అదనంగా వన్ మిలియన్ ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం నుండి సంచిత ఎగుమతులను 80 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, 15 మిలియన్ల చిన్న వ్యాపారాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకొచ్చే పథకాలు కూడా ఈ పెట్టుబడిలో భాగమవుతాయి.
అత్యాధునిక AI టూల్స్, ఆటోమేషన్ సిస్టమ్‌లు, స్మార్ట్ లాజిస్టిక్స్, డేటా ఆధారిత వ్యాపార పరిష్కారాలను చిన్న వ్యాపారులకు అందించడం ద్వారా, అమెజాన్ భారత MSME రంగాన్ని గ్లోబల్ స్థాయిలో పోటీతత్వంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా, 4 మిలియన్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు AI విద్య, కెరీర్ మార్గదర్శనం, సాంకేతిక పరిజ్ఞానం పరిచయం చేయాలని సంస్థ తెలిపింది. ఇది భారతదేశంలో భవిష్యత్ టెక్ టాలెంట్‌ను పెంపొందించడంలో గణనీయమైన పాత్ర పోషించనుంది.
పెరుగుతున్న పోటీ నేపథ్యంలో అమెజాన్ త్వరిత వాణిజ్య (Quick Commerce) రంగంలో తన అడుగులను వేగంగా విస్తరించింది. ప్రస్తుతం బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ వంటి వేగంగా పెరుగుతున్న ప్లాట్‌ఫార్మ్‌లతో పోటీ పడుతున్న అమెజాన్.. 10 నిమిషాల డెలివరీ కోసం భారీగా పెట్టుబడి పెట్టింది.
ప్రధాన మెట్రో నగరాల్లో రోజుకు రెండు కొత్త అర్బన్ డార్క్ స్టోర్‌లను ప్రారంభిస్తూ.. ఈ సంవత్సరం చివరికల్లా 300కు పైగా స్టోర్లు ఏర్పాటు చేయాలనే స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ విస్తరణ అమెజాన్‌ను భారత త్వరిత డెలివరీ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా మార్చే అవకాశం ఉంది.
కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తున్నప్పటికీ, అమెజాన్ తన వివిధ భారత యూనిట్లలో ఖర్చులను తగ్గించే దిశగా కఠిన చర్యలు చేపట్టింది. అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, అమెజాన్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, అమెజాన్ పే, అమెజాన్ హోల్‌సేల్ వంటి విభాగాల్లో ఉద్యోగుల ఖర్చులు, ప్రకటన ఖర్చులు తగ్గించడంతో FY25లో నష్టాలు గణనీయంగా తగ్గాయని ఆర్థిక వివరాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ఆదాయం 19 శాతం పెరిగి రూ.30,139 కోట్లకు చేరడం మహమ్మారి తర్వాత సంస్థ వ్యాపారం బలంగా కోలుకుంటున్నదనడానికి నిదర్శనం.
Amazon యొక్క ఈ భారీ పెట్టుబడులు భారతదేశాన్ని ప్రపంచ రిటైల్, టెక్నాలజీ, AI రంగాల్లో కీలక కేంద్రంగా మార్చవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికన్ టెక్ దిగ్గజాలన్నీ ఇప్పుడు భారత మార్కెట్‌పై మరింత ఆసక్తి చూపుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించగా..గూగుల్ 15 బిలియన్ డాలర్లతో విశాఖపట్నంలో ఒక అత్యాధునిక AI హబ్‌ను నిర్మిస్తోంది. ఈ ధోరణి భారతదేశాన్ని రాబోయే దశాబ్దంలో టెక్ హబ్‌గా మారుస్తుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications