10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం.. భారీ ఉద్యోగాల కోత తర్వాత అమెజాన్ కీలక ప్రకటన..
ప్రపంచవ్యాప్తంగా వేలాది కార్మికులను తొలగించినప్పటికీ.. అమెజాన్ భారత మార్కెట్‌పై తన నమ్మకాన్ని కోల్పోలేదు. పరిశ్రమలో భారీ లేఆఫ్స్ చేసిన కంపెనీల్లో అమెజాన్ ఒకటని విమర్శలు వచ్చినప్పటికీ.. భారతదేశంలో తన పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ ఉంది. ఇప్పటికే దేశానికి 40 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన ఈ అమెరికా దిగ్గజం, ఇప్పుడు మరింత దూకుడుతో ముందుకు సాగుతోంది.
ఇందులో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన తమ వార్షిక స్మ్భవ్ సమ్మిట్‌లో అమెజాన్ మరో భారీ ప్రకటన చేసింది. అదనంగా 35 బిలియన్ల డాలర్లు భారతదేశంలో పెట్టుబడి పెట్టి, 2030 నాటికి మరో 10 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం తమ ముఖ్య లక్ష్యమని కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పునర్నిర్మాణ చర్యల పేరుతో దాదాపు 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించిన అమెజాన్, తన భవిష్యత్ వృద్ధి కేంద్రంగా భారత మార్కెట్‌ను స్పష్టంగా నిర్మించుకుంటోంది.

ఇప్పటికే అమెజాన్ భారతదేశంలో నిర్మించిన విస్తృత మౌలిక సదుపాయాలు..ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, రవాణా నెట్‌వర్క్‌లు, అలాగే AWS క్లౌడ్ మౌలిక వేదిక, అన్నీ దేశీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థకు ముఖ్య ఆధారంగా మారాయి. ఈ భారీ విస్తరణ 2010లో అమెజాన్ భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి క్రమంగా కొనసాగుతోంది. తాజాగా కీస్టోన్ స్ట్రాటజీ విడుదల చేసిన ఆర్థిక ప్రభావ నివేదిక ప్రకారం.. అమెజాన్ ప్రస్తుతం సుమారు 2.8 మిలియన్ ఉద్యోగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, కాలానుగుణంగా మద్దతు ఇస్తోంది. కొత్త పెట్టుబడులు అమలులోకి వస్తే, ఈ సంఖ్య 2030 నాటికి మరింత పెరుగనుంది.
స్మ్భవ్ సమ్మిట్‌లో అమెజాన్ తన మూడు ప్రధాన దిశలను వివరించింది.. AI ఆధారిత డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయడం, భారతీయ ఎగుమతులను భారీ స్థాయిలో పెంచడం, విస్తృత ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశ డిజిటల్ భవిష్యత్తు కంపెనీ వృద్ధితో బలంగా అనుసంధానమైందని తెలిపారు.
లక్షలాది మంది భారతీయ చిన్న వ్యాపారాలకు AI సాధనాలను అందించడం, 2030 నాటికి దేశం నుండి జరిగే ఇ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్ల డాలర్లకు పెంచడం, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో నాలుగు మిలియన్ మంది విద్యార్థులకు AI ఆధారిత విద్య అందించడం అమెజాన్ యొక్క స్పష్టమైన ప్రాధాన్యతలని ఆయన పేర్కొన్నారు.భారతదేశం నుండి ఇప్పటికే 20 బిలియన్ల డాలర్లకు పైగా ఎగుమతులను సాధించిన అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు "Accelerate Exports" పేరుతో మరింత బలోపేతం చేయబడుతోంది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా స్థానిక తయారీదారులు, చిన్న వ్యాపారులు ప్రపంచ మార్కెట్లతో నేరుగా అనుసంధానమవుతారు. అలాగే లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, తయారీ, రవాణా వంటి అనుబంధ రంగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అమెజాన్ ఈ పెట్టుబడులు, ఉద్యోగ సృష్టిని ప్రకటించడం, ప్రపంచవ్యాప్తంగా టెక్ లేఆఫ్స్ జరుగుతున్న సమయానికి ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇటీవల భారతదేశంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం.


Click it and Unblock the Notifications