కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు ఉద్యోగుల భద్రత, జాబ్ సెక్యూరిటీ పైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పారిశ్రామికవేత్తలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, ఉద్యోగుల భద్రత అంశంపై మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు.

ఆర్థికంగా సవాళ్లను అధిగమించేందుకు అండగా
కరోనా ప్రభావం ప్రత్యేకించి అసంఘటిత రంగంపై తీవ్రంగా ఉంటుందని మోడీ అన్నారు. మొత్తం దేశ ఆర్ధిక వ్యవస్థపై దీని ప్రభావం పెరుగవచ్చున్నారు. పర్యాటక రంగం, నిర్మాణ రంగం, సేవల రంగంతో పాటు అసంఘటిత రంగం సహా చిన్న తరహా వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ మహమ్మారిని పారదోలేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్థికంగా సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ఉద్యోగులను తొలగించవద్దు..
టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా పరిశ్రమలు తమ ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేసేందుకు అనుమతించాలని మోడీ కోరారు. ఉద్యోగులను తొలగించవద్దని, సామాజిక దూరం అనేది కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు బలమైన ఆయుధం అన్నారు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్నారు. కరోనాతో వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం కారణంగా ఉద్యోగులను మాత్రం తొలగించవద్దన్నారు.

నిత్యావసర వస్తువుల ఉత్పత్తి తగ్గవద్దు
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర వస్తువుల కొరత లేకుండా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. ఉత్పత్తుల వల్ల బజారుకు పోకుండా అడ్డుకోవాలని, ముడి వనరులు ధరలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో ఒకసారి కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకోవద్దన్నారు. అక్రమ నిల్వలకు, చట్ట వ్యతిరేక వ్యాపారానికి తావివ్వవద్దని కోరారు.

ఫార్మా ప్రతినిధులతోను..
ఫార్మా రంగ ప్రతినిధులతో కూడా ప్రధాని మాట్లాడారు. కరోనా పరీక్షల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్ఎన్ఏ టెస్టింగ్ కిట్స్ తయారు చేయాలన్నారు. అత్యవసర మందులను సరఫరా చేయాల్సిన అవసరముందని, బ్లాక్ మార్కెటింగ్‌ను, దొంగ నిల్వలను అరికట్టేందుకు సహకరించాలన్నారు.


Click it and Unblock the Notifications