వేతనం లేని సెలవు, 60% శాలరీ: మార్చి వరకు గడువు, ఏదో ఆప్షన్ ఎంచుకోండి!
పర్మినెంట్ ఉద్యోగులు వేతనంలేని సెలవు(LWP)ను ఉపయోగించుకోవడం లేదంటే వారంలో మూడు రోజుల పాటు మాత్రమే పనిచేసి అరవైశాతం వేతనం తీసుకొనే పథకాల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవడానికి ఎయిరిండియా గతంలో ఇచ్చిన గడువును తాజాగా పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు ఈ పథకాల్లో ఒకదానిని ఉద్యోగులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. LWP పథకాన్ని 2020 జూలై 14వ తేదీన తీసుకు వచ్చింది. దీనిని సెప్టెంబర్ 30వ తేదీకి ఈ గడువును పొడిగించింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పొడిగింపు ఇచ్చింది.

60 శాతం మంది ఎంచుకున్నారు
తాజాగా వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 9వ తేదీన ఎయిర్ ఇండియా జనరల్ మేనేజర్ (ఇండస్ట్రియల్ రిలేషన్స్) మీనాక్షి కష్యప్ స్టాఫ్ నోటీస్ జారీ చేశారు. ఎయిరిడిండియాలో 13,000 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 60 మంది ఉద్యోగులు ఈ పథకాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో వార్షిక వేతన బిల్లులో రూ.7 కోట్ల వరకు సంస్థకు కలిసి వస్తుంది.

ఈ రెండు స్కీంలు
ఎయిరిండియా బోర్డు జూలై నెలలో ఉద్యోగులకు వేతనం లేని సెలవు ఆప్షన్‌కు ఆమోదం తెలిపింది. ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు కాలపరిమితికి ఉద్యోగులను సెలవులపై పంపించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిని ఐదేళ్ళ వరకు కూడా పొడిగించే అవకాశం ఉంది. వేతనం లేని సెలవులు ఆప్షన్ ఎంచుకోకుంటే పర్మినెంట్ సిబ్బంది (పైలట్లు, క్యాబిన్ సిబ్బంది మినహా) వారానికి మూడు రోజుల పాటు 60 శాతం వేతనంతో పని చేయడం కోసం 'షార్టర్ వర్కింగ్ వీక్ స్కీం'ను అందుబాటులోకి తెచ్చింది.

ఆక్యుపెన్సీ సగమే...
కరోనా మహమ్మారి కారణంగా విమానయాన రంగంపై భారీగా ప్రభావం పడింది. విమానాలు నెలల పాటు విమానాశ్రయాలకే పరిమితమయ్యాయి. మే 25వ తేదీ నుండి భారత్‌లో విమాన కార్యకలాపాలు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. కరోనా మహమ్మారి పూర్వస్థితిలో 45 శాతం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. డొమెస్టిక్ విమానాలు మే 25 నుండి 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇది ఈ రంగంపై ప్రభావం చూపుతోంది. భారత విమానాల్లో పాసింజర్ డిమాండ్ ఈ క్యాలెండర్ ఇయర్‌లో 49 శాతం క్షీణించింది.


Click it and Unblock the Notifications