30 లక్షల ఉద్యోగులు రోడ్డు మీదకు.. AI కొట్టే దెబ్బ మాములుగా లేదు.. మరి మీ జాబ్ సంగతి ?
కృత్రిమ మేధస్సు లేదా AI ప్రస్తుతం నెమ్మదిగా కాకుండా..అత్యంత వేగంగా మన జీవితంలో అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది. ముఖ్యంగా వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాల రంగంలో దీని ప్రభావం రోజు రోజుకూ పెరుగుతోంది. పని చేసే విధానం మారిపోతోంది. పనిని చేసే వ్యక్తులు మారిపోతున్నారు, ముఖ్యంగా పునరావృత పనులకు అవసరమైన మానవ శక్తి ఇప్పుడు యంత్రాల ద్వారా భర్తీ అవుతోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించిన ఆటోమేషన్ ఇప్పుడు వాస్తవంగా మన ఉద్యోగాలను ప్రభావితం చేయడం ప్రారంభించింది.
ఇటీవల నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ (NFER) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాబోయే పదేళ్లలో ప్రత్యేకంగా 2035 నాటికి సుమారు మూడు మిలియన్ల తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు అంతరించిపోయే అవకాశం ఉంది అని అంచనా వేసింది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో 2.3 మిలియన్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కూడా ఈ నివేదిక పేర్కొంది. అయితే ఈ కొత్త ఉద్యోగాలు అందరికీ సమానంగా లభించవు.

ఎందుకంటే ఈ అవకాశాల కోసం ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు, AI పరిజ్ఞానం, ఉన్నత స్థాయి సమస్యల పరిష్కార సామర్థ్యాలు అవసరం అవుతాయి. ఈ కారణంగా ఉద్యోగం కోల్పోయే వ్యక్తులు కొత్త ఉద్యోగాల కోసం సిద్ధం కావడం కష్టతరం అవుతుంది. భవిష్యత్తులో అసమానతలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నివేదిక ప్రకారం.. ప్రత్యేకంగా మానవ శక్తిపై ఆధారపడే, పునరావృత పనులను కలిగిన ఉద్యోగాలే ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటాయి.
ఉదాహరణకు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, మెషిన్ ఆపరేటర్లు, క్యాషియర్లు, గిడ్డంగి కార్మికులు, రూఫింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వంటి వృత్తుల్లో పనిచేసే వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యంత్రాలు మరింత ఖచ్చితత్వంతో, తక్కువ ఖర్చుతో, నిరంతరం పనిచేయగలుగుతున్నందున, సంస్థలు మానవ శక్తిని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇక సృజనాత్మకత, నిర్ణయం తీసుకోవడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, సంక్లిష్ట పరిస్థితులను విశ్లేషించడం వంటి గుణాలు అవసరమైన ఉద్యోగాలకు భవిష్యత్తులో మరింత విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగం, నిర్వహణ, ఇంజినీరింగ్, శాస్త్ర పరిశోధనలు, మానసిక వైద్య శాస్త్రం వంటి రంగాల్లో పనులు పెరుగుతాయి. కానీ ఈ రంగాల్లో కూడా ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల తగ్గే అవకాశమున్నట్లు నివేదిక సూచించింది.
నివేదిక రచయిత జూడ్ హిల్లరీ మాట్లాడుతూ ..ప్రస్తుతం సంస్థలు, ఉద్యోగుల మధ్య పెద్ద అనిశ్చితి వాతావరణం నెలకొంది. AI ప్రభావంపై స్పష్టమైన దిశ లేకుండా కొనసాగుతున్న చర్చలు ఉద్యోగుల్లో భయాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 2025లో ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు, అంటే Google, Amazon, Meta, Microsoft వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాలను కోతపెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఈ కోతలు నిజానికి AI తీసుకువస్తున్న మార్పుల తొలి దశగా భావించవచ్చు.
క్లుప్తంగా చెప్పాలంటే భవిష్యత్తు ఒక వర్గానికి భయంకరంగా మారనుండగా, మరొక వర్గానికి అవకాశాల గనిగా కనిపిస్తోంది. నైపుణ్యాలు ఉన్నవారికి ఇది బంగారు యుగం కాగా, కొత్త పరిస్థితులకు సిద్ధం కానివారికి ఇది అత్యంత కఠిన సమయం కావచ్చు. అందుకే, నేటి పరిస్థితుల్లో ఎవరికైనా భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో నిలబడాలంటే తమ నైపుణ్యాలను మార్చుకోవడం, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, AIను శత్రువుగా కాకుండా ఒక సాధనంగా చూడడం చాలా కీలకమని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications