AIతో ఉద్యోగం కోల్పోయిన వారికి మళ్లీ ఆఫర్.. తిరిగి ఉద్యోగంలో చేరమంటున్న కంపెనీలు..కారణం ఏంటంటే..
AI Layoffs Reversal: కృత్రిమ మేధ (AI) కంపెనీలను వేగవంతంగా, సమర్థవంతంగా మారుస్తుందనే అంచనాలతో అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించి, ఆ స్థానాల్లోకి సాంకేతికతను తీసుకువచ్చాయి. అయితే, మనుషుల స్థానంలో ఏఐని నియమించడం తమ ఊహించినంత సులభం కాదని కంపెనీలు ఇప్పుడు తెలుసుకుంటున్నాయి.
టాలెంట్ అసెస్‌మెంట్ సంస్థ SHL పరిశోధనను ఉటంకిస్తూ ఫార్చ్యూన్ నవంబర్ 9న వెలువరించిన నివేదిక ప్రకారం.. సర్వే చేసిన అమెరికా కార్మికులలో 19.1 శాతం మంది, అలాగే యూకే, అమెరికా అంతటా 16 శాతం మంది తమ స్థానాలను ఏఐ భర్తీ చేసిందని, అయితే తదనంతరం కంపెనీలు తమనే తిరిగి ఉద్యోగాల్లోకి రావాలని కోరాయని తెలిపారు. ఈ షయాన్ని SHL 'AI రీబౌండింగ్' అని పిలుస్తోంది. ఉద్యోగుల స్థానంలోకి వచ్చిన ఏఐ సాంకేతికత వారు చేసిన పనిని పూర్తిగా చేయలేకపోవడం యజమానులకు కొత్త సవాళ్లను విసురుతోంది.

ఈ సమస్య కేవలం చాట్‌బాట్‌లు, ఆటోమేటెడ్ సిస్టమ్‌ల పరిమితులకే పరిమితం కాకుండా మానవ అనుభవాన్ని ఏఐ భర్తీ చేయలేకపోతోందనే వాస్తవాన్ని బయటపెడుతోంది. ఉద్యోగులకు ఉండే సంస్థాగత పరిజ్ఞానం, వినియోగదారులతో సంబంధాలు, వృత్తిపరమైన విచక్షణ వంటి వాటిని సాంకేతికత ద్వారా పునఃసృష్టించడం సాధ్యం కాదని కంపెనీలు గుర్తిస్తున్నాయి. రాబర్ట్ హాఫ్ నియామక సంస్థ జూలై సర్వే ప్రకారం.. ఏఐ కారణంగా ఉద్యోగులను తొలగించిన కంపెనీలలోని 32 శాతం మంది నియామక నిర్వాహకులు ఆ తర్వాత అవే లేదా అలాంటి ఉద్యోగాల్లోకే మనుషులను తిరిగి నియమించుకోవాల్సి వచ్చింది.
ఇందుకు ప్రధాన కారణంగా 40 శాతం మంది ఏఐ భర్తీ చేయలేని సంస్థాగత పరిజ్ఞానాన్ని ప్రస్తావించగా.. 39 శాతం మంది మానవ సంబంధాల నిర్వహణను, 38 శాతం మంది పనికి ఊహించిన దానికంటే ఎక్కువ మానవ పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత నాణ్యతా నియంత్రణ సాధనాలు ఆశించిన రీతిలో పనిచేయకపోవడంతో.. ఆటోమొబైల్ తయారీ సంస్థ ఫోర్డ్ జూన్ నెలలో 350 మంది అనుభవజ్ఞులైన ఇంజనీర్లను నియమించుకుని వారికి పదోన్నతులు కూడా కల్పించింది. ఏఐ నాణ్యతను పెంచగలదని, కానీ అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ బృందాల అవసరం ఎల్లప్పుడూ ఉంటుందని ఫోర్డ్ స్పష్టం చేసింది.
మరోవైపు తిరిగి విధుల్లోకి రావాలని కోరబడుతున్న ఉద్యోగులు పాత నిబంధనలకు అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. SHL పరిశోధనల ప్రకారం 51 శాతం మంది తిరిగి విధుల్లో చేరడానికి గణనీయమైన వేతన పెంపును కోరగా, 42 శాతం మంది భవిష్యత్ ఉద్యోగ భద్రతపై లిఖితపూర్వక హామీలను, 40 శాతం మంది తమ పాత్రలలో ఏఐని ఎలా ఉపయోగిస్తారనే దానిపై పారదర్శకతను డిమాండ్ చేస్తున్నారు. గతంలో సులభంగా భర్తీ చేయగల వారిగా భావించిన ఉద్యోగులతో యజమానులు తిరిగి నమ్మకాన్ని నిర్మించుకోవాల్సి వస్తోంది. అక్టోబర్ 29న అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసిన నివేదిక కూడా ఇటువంటి ఆఫర్లను అంగీకరించే ముందు మెరుగైన వేతనం, కెరీర్ పురోగతి అవకాశాలు, భవిష్యత్ ఆటోమేషన్ పై స్పష్టత కోసం చర్చలు జరపడం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పింది. ఉద్యోగులు తమ అనుభవాన్ని ఏఐ అమలు, పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణతో కలిపే కొత్త పాత్రలను కూడా అన్వేషిస్తున్నారు.
భారతదేశం కూడా ఏఐ వినియోగంతో ముడిపడి ఉన్న ఉపాధి మార్పులను ఎదుర్కొంటోంది. ఇండియా టుడే నివేదించిన నోమురా విశ్లేషణ ప్రకారం.. భారత్‌లో ఏఐ కారణంగా 31,921 ఉద్యోగాల తొలగింపులు జరగ్గా, 83,100 ఏఐ సంబంధిత కొత్త నియామకాలు నమోదయ్యాయి. ఇది ఏఐ పాత ఉద్యోగాలను దెబ్బతీస్తున్నప్పటికీ కొత్త అవకాశాలను సృష్టిస్తోందని సూచిస్తోంది. అయినప్పటికీ ఈ మార్పు సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా టెక్నాలజీ, ఆర్థిక సేవల రంగాలలో కొత్త గ్రాడ్యుయేట్లకు కేటాయించే ఆరంభ స్థాయి సాధారణ పనులను ఏఐ అధిగమిస్తుండటంతో ప్రవేశ స్థాయి అవకాశాలు దెబ్బతింటున్నాయి.
అయితే ఏఐ రీబౌండింగ్ అంటే ఆటోమేషన్ పూర్తిగా విఫలమైందని కాకుండా, మానవ నైపుణ్యాన్ని కేవలం ఒక ఖర్చుగా భావించి తొలగించడంలో ఉన్న ప్రమాదాలను హెచ్చరిస్తోంది. ఆటోమేషన్ యుగంలో ఏఐతో ఎలా పనిచేయాలో తెలుసుకోవడంతో పాటు మానవ విచక్షణ, అనుభవం, సృజనాత్మకత మరియు వ్యక్తులను నిర్వహించే సామర్థ్యం కూడా అంతే ముఖ్యం. ఏఐ మనిషి చేసే పనిని చేయగలదా లేదా అన్న దానికంటే, ఆ పని చేస్తున్న వ్యక్తిని తొలగించే ముందు ఆ ఉద్యోగంలో ఉన్న సంక్లిష్టతలను కంపెనీలు పూర్తిగా అర్థం చేసుకున్నాయా లేదా అన్నదే ప్రధాన ప్రశ్నగా మారుతోంది.


Click it and Unblock the Notifications
