ఏఐతో ఉద్యోగాలు: ఫ్రెషర్లకు భవిష్యత్తు లేదా? స్టాన్‌ఫోర్డ్ షాకింగ్ నిజం!
ఏఐ లేకుండా ఇకపై ఏ రంగం, ఏ ఉద్యోగం ముందుకు సాగలేని పరిస్థితి వచ్చేసింది. కానీ, జాబ్ మార్కెట్‌లో ఎవరూ ఊహించని ఓ మార్పు చోటుచేసుకుంటోంది. దీనివల్ల కొత్తగా డిగ్రీలు పూర్తి చేసుకుని వస్తున్న గ్రాడ్యుయేట్లు, యువ ఉద్యోగులు తమ అవకాశాలను కోల్పోతున్నారని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆర్థికవేత్త ఎరిక్ బ్రైన్‌జోల్ఫ్‌సన్ హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఉద్యోగంలోనూ చాలా పనులు ఉంటాయి. వాటిలో చాలావాటిని ఏఐతో ఆటోమేట్ చేస్తున్నప్పటికీ, ఏఐ చేసిన పనిని సమీక్షించడం, ఆమోదించడం, సరిగ్గా దాన్ని మేనేజ్ చేయడం వంటివి మనుషులే చేయాలి. కాబట్టి, మనుషులు లేకుండానే పనులు జరిగిపోతాయన్న పరిస్థితి ప్రస్తుతానికి లేదు.
అయితే, అసలు సమస్య ఏంటంటే.. ఎలాంటి ఉద్యోగాలు ఆటోమేట్ అవుతున్నాయి? దానివల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు? అనేదే ఇక్కడ కీలకం.
ఈ ఏఐ యుగంలో ఉద్యోగాలు కోల్పోవడం, కొత్త ఉద్యోగాలు దొరక్కపోవడం వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటోంది ఫ్రెషర్లు లేదా 22-26 ఏళ్ల మధ్య వయసున్న యువతే.

వారు పనిచేసే చాలా రంగాల్లో ఏఐ ఆధిపత్యం పెరిగిపోయింది. అలాగే, ప్రతి కంపెనీలోనూ ఏఐని ప్రాథమిక లేదా ప్రారంభ దశ పనుల కోసమే ఎక్కువగా ఆటోమేట్ చేస్తున్నారు. దీనివల్ల ఫ్రెషర్లు చేసే రొటీన్ పనులు ఆటోమేషన్‌కు గురవుతున్నాయి. ఫలితంగా, రాబోయే కొన్నేళ్లలో వారికి అవకాశాలు, జీతాలు భారీగా తగ్గుతాయని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆర్థికవేత్త ఎరిక్ బ్రైన్‌జోల్ఫ్‌సన్ హెచ్చరించారు.
సాధారణంగా, ప్రతి కంపెనీ ఎక్కువ సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకుని పనిచేస్తుంది. కానీ ఏఐ వచ్చిన తర్వాత, ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు భారీగా తగ్గనున్నాయి. దీనివల్ల కంపెనీల 'పిరమిడ్ స్ట్రక్చర్' కాస్తా 'డైమండ్ స్ట్రక్చర్'గా మారుతుందని కూడా ఎరిక్ హెచ్చరించారు.
పిరమిడ్ స్ట్రక్చర్‌లో ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. వారి తర్వాత మిడ్-లెవల్, ఆ పైన అత్యంత తక్కువగా సీనియర్-లెవల్ ఉద్యోగులు ఉంటారు. కానీ, డైమండ్ స్ట్రక్చర్‌లో ఎంట్రీ-లెవల్, సీనియర్-లెవల్ ఉద్యోగుల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. మిడ్-లెవల్ ఉద్యోగులు మాత్రం ఎక్కువగా ఉంటారు. దీనివల్ల ఖర్చులను తగ్గించుకుని, ఉత్పాదకతను పెంచుకోవచ్చు. అదేవిధంగా, ఎంట్రీ-లెవల్ ఉద్యోగుల పనులను ఏఐ భర్తీ చేస్తుంది.


Click it and Unblock the Notifications