ఏఐ ప్రభావం: ఐటీ ఉద్యోగాలు, ఫ్రెషర్లకు భారీ దెబ్బ!
దేశంలోనే అత్యధికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారుచేసే రాష్ట్రాల్లో తమిళనాడు ముందుంటుంది. కానీ, ఇప్పుడు అక్కడి కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు భారీగా దెబ్బతిన్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తమిళనాడు కాలేజీల్లో ఐటీ కంపెనీల ప్లేస్మెంట్లు జోరుగా ఉంటాయి, కానీ ఈ ఏడాది పరిస్థితి తలకిందులైంది.
ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వేగంగా పెరుగుతుండటంతో, తమిళనాడులోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్రెషర్ల నియామకాలు (Fresher Hiring) 20% వరకు పడిపోయాయని 'మిర్రర్ నౌ' నివేదిక వెల్లడించింది. ఇకపై కేవలం బేసిక్ కోడింగ్ నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భవిష్యత్తులో ఏఐ రూపొందించిన కోడింగ్‌ను సరిచూడటం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, డేటాను విశ్లేషించడం వంటి నైపుణ్యాలు ఉన్న విద్యార్థుల కోసమే కంపెనీలు ఎదురుచూస్తాయని విద్యావేత్తలు, ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.

కోడింగ్ రాయడం, టెస్టింగ్ చేయడం వంటి పనులను కంపెనీలు ఇప్పటికే ఏఐ టూల్స్‌తో ఆటోమేట్ చేశాయి. అందుకే, గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకాలు 20% కంటే ఎక్కువగా తగ్గినట్లు ఆ నివేదిక పేర్కొంది.
అన్నా యూనివర్సిటీలో గతేడాది నవంబర్ నాటికి సాఫ్ట్వేర్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో 498 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా, ఈ ఏడాది ఆ సంఖ్య 416కి పడిపోయింది. ఏఐ ప్రభావంతో ఐటీ కంపెనీల్లో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు తగ్గిపోయాయని, అందుకే విద్యార్థులతో పాటు అధ్యాపకులకు కూడా ఏఐ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో కూడా ఐటీ ప్లేస్మెంట్లు గతేడాదితో పోలిస్తే 10% నుంచి 15% వరకు తగ్గాయి. 'మిర్రర్ నౌ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సంస్థ వైస్-ఛాన్సలర్ మాట్లాడుతూ.. ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలు పూర్తిగా పోవని, కానీ ఉద్యోగాల స్వరూపం మారుతోందని అన్నారు. సంక్లిష్టమైన వ్యవస్థలను అర్థం చేసుకుని, వ్యాపార సమస్యలను పరిష్కరించగల గ్రాడ్యుయేట్ల కోసం కంపెనీలు చూస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఐటీ కంపెనీల్లో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు మాయం కాలేదు, కానీ వాటికి కావాల్సిన అర్హతలు పెరిగాయి. గతంలో విద్యార్థులను ఉద్యోగంలోకి తీసుకున్నాక, కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చి ఆ తర్వాతే అసలు పని అప్పగించేవారు. కానీ ఇప్పుడు, ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే పూర్తిస్థాయిలో పనిచేయాలని కంపెనీలు ఆశిస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
ఏఐ నైపుణ్యాలు కేవలం ఐటీ ఉద్యోగాలకే పరిమితం కాదు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా తమ కోర్ సబ్జెక్టులతో పాటు ఏఐని ఎలా ఉపయోగించాలో తెలిస్తేనే ఉద్యోగావకాశాలు లభిస్తాయని విద్యా, ఉపాధి రంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు.


Click it and Unblock the Notifications