అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారతదేశం-రష్యా ఆర్థిక సంబంధాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చనిపోయాయని.. ఇక లేచే పరిస్థితి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాను రెచ్చగొట్టవద్దని రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ భారతదేశం రష్యాకు ఏమి చేసినా నాకు పట్టదు. వారు తమ చనిపోయిన ఆర్థిక వ్యవస్థలను వారితో పాటు తీసుకెళ్లవచ్చు.. నాకు దాంతో ఒరిగేదేమి లేదని తేల్చి చెప్పారు.
భారత్ దిగుమతి సుంకాలను చాలా ఎక్కువగా విధించిందని చెప్పుకొచ్చారు. మా దేశం ఇండియాతో చాలా తక్కువ వాణిజ్యం చేసిందని కూడా Trump పేర్కొన్నారు. భారతదేశం విధించే సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధికమైన వాటిలో ఒకటని ట్రంప్ మండిపడ్డారు. తన అధ్యక్ష పదవిలో ఉండగా ట్రంప్ పదే పదే ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. రష్యాతో ఎటువంటి ముఖ్యమైన వాణిజ్య సంబంధాన్నిజరపబోమని ట్రంప్ తేల్చి చెప్పారు. రష్యా - అమెరికా మధ్య దాదాపుగా ఎటువంటి వాణిజ్యం లేదు. అది అలాగే ఉండనివ్వండని అన్నారు.

ఆగస్టు 1 నుండి భారతదేశం నుండి వచ్చే ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి విదితమే. దీనితో పాటు, రష్యా నుండి ఇంధనం కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అదనపు'జరిమానా' విధించడంపై కూడా ట్రంప్ మాట్లాడారు. ఏప్రిల్ ప్రారంభంలో కూడా భారతదేశంపై 26 శాతం ప్రతీకార సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.అయితే అది 25 శాతానికి తీసుకువచ్చారు.
ప్రస్తుతం, అమెరికా భారతదేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (MFN) కింద విధించే సుంకానికి అదనంగా 10 శాతం బేసిక్ డ్యూటీని కూడా విధిస్తోంది. ట్రంప్ తాజా ప్రకటన ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత మరింత తీవ్రం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్- అమెరికా మధ్య ఇప్పటికే ఐదు రౌండ్ల తీవ్రమైన చర్చలు జరిగినప్పటికీ, ఆగస్టు 1 కి ముందు ఎటువంటి మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరని సమయంలో ఈ కఠిన చర్య బయటకు వచ్చింది. అమెరికా ఇప్పటికే ఆగస్టు 1 ను తన వాణిజ్య భాగస్వాములందరిపై దేశ-నిర్దిష్ట ప్రతీకార సుంకాలను విధించడానికి గడువుగా నిర్ణయించింది.
నిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, 'భారతదేశం మాకు మిత్రదేశం కానీ గత సంవత్సరాల్లో మేము వారితో తక్కువ వాణిజ్యం చేసాము ఎందుకంటే వారు చాలా ఎక్కువ స్థాయిలో సుంకాలను విధిస్తున్నారు. అలాగే అత్యంత కఠినమైన నాన్-టారిఫ్ వాణిజ్య అడ్డంకులు కూడా ఉన్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ రష్యా నుండి తన సైనిక పరికరాలను కొనుగోలు చేస్తోంది. రష్యా-చైనాతో పాటు రష్యన్ ఇంధనానికి కూడా పెద్ద కొనుగోలుదారుగా ఉంది, అయితే ప్రపంచం రష్యా ఉక్రెయిన్‌లో దాడులను ఆపాలని కోరుకుంటోంది. ఈ సమయంలో వారి వ్యాపార వాణిజ్యం సరైనది కాదని ట్రంప్ అన్నారు.
ఇందులో భాగంగానే ఆగస్టు 1 నుంచి భారతదేశం 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని.. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసినందుకు 'జరిమానా' కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం నిరవధికంగా నిలిచిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపినప్పటికీ సత్ఫలితాలు ఇవ్వలేదు. ఐదు రౌండ్ల చర్చల తర్వాత కూడా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు . ఈ నేపథ్యంలో ఆరవ రౌండ్ చర్చలు ఆగస్టు చివరిలో భారత్‌లో జరగనున్నట్లుగా తెలుస్తోంది.
అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకుల ప్రకారం.. ఈ సుంకాలు తాత్కాలికంగా అమలులోకి వస్తాయని భారత ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఒప్పందం ఖరారైతే, ఈ సుంకాలను అమెరికా వెనక్కి తీసుకునే అవకాశముంది. అమెరికా తన ఉత్పత్తులకు భారతదేశ మార్కెట్లో తలుపులు తెరవాలని కోరుకుంటోంది.ముఖ్యంగా పాడి పంటల ఉత్పత్తులను భారత్ లోకి తీసుకురావాలని గట్టిగా పట్టుబడుతోంది. అయితే వ్యవసాయం, పాడి రంగాల విషయంలో భారత్ ఈ అంశాలను స్పష్టంగా తిరస్కరిస్తోంది. ఈ అంశాలే వాణిజ్య చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications