అమెరికా భారతదేశం నుంచి వస్తున్న వస్త్ర ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించడంతో, భారత గార్మెంట్ ఎగుమతులు నెమ్మదించే అవకాశం ఉందని ఆపరల్ ఎగుమతుల ప్రమోషన్ కౌన్సిల్ (AEPC) తెలిపింది.

AEPC చైర్మన్ సుధీర్ శేఖ్రీ మాట్లాడుతూ, ఈ శాతం వాస్తవానికి ఊహించిన కంటే ఎక్కువే అయినా, పరిశ్రమ ఇది చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. "ఈ టారిఫ్ రేటు ఊహించిన దానికంటే ఎక్కువ. అయినప్పటికీ వియత్నాం, బంగ్లాదేశ్‌లపై ఉన్న టారిఫ్‌లు తగ్గించకపోతే, మనం పెద్దగా కలవరం పడాల్సిన పని లేదు," అని ఆయన తెలిపారు.
అమెరికా భారత గార్మెంట్ ఎగుమతులలో అత్యంత కీలకమైన దేశం. 2024లో మొత్తం భారత తయారుచేసిన వస్త్రాల ఎగుమతుల్లో 33% వాటా అమెరికాకే వెళ్లింది. 2020లో 4.5% మాత్రమే ఉన్న భారత వాటా, 2024 నాటికి 5.8% కి పెరిగి, అమెరికాకు నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా భారతదేశం ఎదిగింది.
చైనా ఇప్పటికీ అమెరికాకు గార్మెంట్ల ప్రధాన ఎగుమతిదారుగానే ఉన్నప్పటికీ, 2020లో 27.4% ఉన్న వాటా, 2024 నాటికి "21.9%"కి పడిపోయింది. వియత్నాం, బంగ్లాదేశ్‌లు కూడా అమెరికా గార్మెంట్ మార్కెట్‌లో తమ స్థిరతను కొనసాగిస్తున్నాయి. ఈ మూడు దేశాలు కలిసి మొత్తం అమెరికన్ వస్త్ర దిగుమతుల్లో 50%కి పైగా వాటాను కలిగి ఉన్నాయి.
భారతదేశం నుంచి అమెరికాకు ప్రధానంగా ఎగుమతయ్యే వస్త్ర ఉత్పత్తుల్లో:
1. కాటన్ టీ-షర్ట్లు - మొత్తం ఎగుమతుల్లో 9.71% వాటా. అమెరికాలోని టీ-షర్ట్ దిగుమతుల్లో 10% భారత ఉత్పత్తులు
2. మహిళల/యువతుల కాటన్ డ్రెస్సులు - 6.52. అమెరికా డ్రెస్సుల మార్కెట్‌లో 36% వాటా
3. బేబీల కాటన్ దుస్తులు - 5.46%. అమెరికాలో ఈ విభాగంలో 20% భారత ఎగుమతులు ఉన్నాయి.
శేఖ్రీ చెప్పారు "ఈ టారిఫ్ వల్ల తాత్కాలికంగా గార్మెంట్ ఎగుమతులు కొంత తగ్గే అవకాశముంది. కానీ భారత్, అమెరికా మధ్య వచ్చే అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 మధ్యకాలంలో ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందం (BTA) కుదిరే అవకాశం ఉంది. ఆ ఒప్పందం ద్వారా పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తున్నాము" అని చెప్పారు. "ఈ పెనాల్టీ అంశం ఇంకా స్పష్టత లేని విషయం. కానీ ఇండియన్ గవర్నమెంట్, ఆగస్టు 1, 2025లోపు అమెరికాతో చర్చించి దీన్ని పరిష్కరించే అవకాశం ఉంది," అని AEPC చైర్మన్ పేర్కొన్నారు.
భారత గార్మెంట్ పరిశ్రమకు అమెరికా నుంచి వచ్చిన 25% టారిఫ్ నిర్ణయం తాత్కాలికంగా ప్రభావం చూపవచ్చు. కానీ, భారత్ వివిధ విభాగాల్లో అమెరికాలో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. త్వరలో జరుగనున్న ద్వైపాక్షిక ఒప్పందాలపై ఆధారపడి ఎగుమతుల భవిష్యత్ ఉంది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమ ఆందోళన కాకుండా చిత్తశుద్ధితో ముందుకు సాగాలనే సూచనలే వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications