కోలుకుంటున్నాం.. ఆ పన్నులు ఏకంగా 49% పెరిగాయి: ఏడాదిలో ఇదీ లెక్క
కరోనా మహమ్మారి నుండి కోలుకుంటున్న సంకేతాలు ఎప్పటికప్పుడు కనిపిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటడం, వాహనాల అమ్మకాలు పెరుగుతుండటం, ఉత్పత్తి పెరగడం వంటి వివిధ గణాంకాలు ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటున్నట్లుగా సూచిస్తున్నాయి. తాజాగా కార్పోరేట్ ముందస్తు చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. మూడో త్రైమాసికంలో 49 శాతం వృద్ధిని సాధించాయి. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(CBDT) వర్గాలు కార్పోరేట్ పన్ను చెల్లింపులు పెరిగినట్లు చెబుతున్నాయి.

లక్ష కోట్లు దాటిన కార్పోరేట్ ముందస్తు పన్ను
2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీల ముందస్తు పన్ను చెల్లింపులు 49 శాతం వృద్ధి చెంది రూ.1,09,506 కోట్లకు చేరినట్లు CBDT వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో తక్కువ ప్రాతిపదిక వల్ల ఈ వృద్ధి కనిపించింది. కార్పోరేట్ పన్నును గత ఏడాది మూడో క్వార్టర్‌లో రికార్డ్ స్థాయి కనిష్టం 25 శాతానికి తగ్గించడంతో అప్పుడు రూ.73,126 కోట్ల ముందస్తు పన్ను వసూలయింది. ఈసారి లక్ష కోట్లు దాటింది. కరోనా వైరస్ సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నదని చెప్పడానికి ఇది మరో సంకేతమంటున్నారు.

గత ఏడాదితో పోలిస్తే..
సమీక్ష త్రైమాసికానికి స్థూల పన్ను వసూళ్లు రూ.7,33,715 కోట్లు కాగా, నికర పన్ను వసూళ్లు రూ.5,87,605 కోట్లుగా నమోదయింది. అదే సమయంలో పన్ను విభాగం రూ.1,46,109 కోట్లను రీఫండ్ చేసింది. 2019-20 మూడో త్రైమాసికంలో రూ.1,58,988 కోట్లు రీఫండ్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రీఫండ్ 8.1 శాతంగా నమోదయింది.
ఇక, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.2,39,125 కోట్ల ముందస్తు కార్పోరేట్ పన్నులు వసూలయ్యాయి. గత ఏఢాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం 4.9 శాతం తక్కువ. గత ఏడాది రూ.2,51,382 కోట్లు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో కరోనా లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాలు మందగించడం వల్ల తగ్గింది.

వ్యక్తిగత పన్ను వసూళ్లు
ముందస్తు వ్యక్తిగత ఆదాయ పన్ను మూడో త్రైమాసికంలో రూ.32,910 కోట్ల నుండి 5.6 శాతం క్షీణించి రూ.31,054 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన రూ.67,542 కోట్ల నుండి 10.4 శాతం తగ్గి రూ.60,491 కోట్లకు పరిమితమైంది.
ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో స్థూల పన్ను వసూళ్ళు 31 శాతం క్షీణించి రూ.1,37,825 కోట్లకు తగ్గాయి. లాక్ డౌన్ కారణంగా ముందస్తు చెల్లింపులు 76 శాతం క్షీణించి రూ.11,714 కోట్లుగా నమోదయ్యాయి. కార్పోరేట్ పన్ను చెల్లింపులు 79 శాతం తగ్గి రూ.8,286 కోట్లు, ఆదాయ పన్ను ముందస్తు చెల్లింపులు 64 శాతం తగ్గి రూ.3,428 కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-సెప్టెంబర్ అర్ధ సంవత్సరంలో కార్పోరేట్ పన్ను రూ.99,126 కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.1,47,004 కోట్లుగా నమోదయింది.


Click it and Unblock the Notifications