మందగమనం ఎఫెక్ట్... ముందస్తు పన్నులు ఎంత తగ్గాయంటే..
దేశ ఆర్ధిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతోంది. ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలకన్నా క్షీణిస్తోంది. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి 4.5 శాతం గా నమోదయింది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో జరగక పోవడం వల్ల కంపెనీలు అమ్మకాల్లో వృద్ధిని సాధించలేక పోతున్నాయి. ఫలితంగా పన్ను వసూళ్ల పై దెబ్బ పడుతోంది. పన్ను వసూళ్లు తగ్గడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రభావం పడుతోంది. దీంతో పలు రకాల ప్రజా వ్యయాలు తగ్గడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

5.2 శాతం మేర తగ్గిన కార్పోరేట్ ముందస్తు పన్ను
ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2019-20) అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ ముందస్తు పన్ను చెల్లింపులు 5.2 శాతం మేర తగ్గి రూ.73,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది ఇదే కాలంలో కార్పొరేట్లు చెల్లించిన పన్నుల మొత్తం రూ. 77,000 కోట్లుగా ఉంది. ఇందుకు కారణాలున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం ఒకటయితే పన్ను రేట్లు తగ్గించడం మరొకటిగా చెబుతున్నారు. అడ్వాన్స్ టాక్స్ అస్సెస్‌లు ప్రతి త్రైమాసికంలో మూడో నెల 15న చెల్లిస్తుంటారు.

కార్పొరేట్ల పన్ను తగ్గింపు
* గత బడ్జెట్లో ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దీని మూలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే గత సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించింది. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న, కొత్త కంపెనీలకు కూడా కార్పొరేట్ పన్నురేట్లను వరుసగా 25 శాతం, 15 శాతానికి తగ్గించారు.
* వ్యక్తిగత ఆదాయ పెను వసూళ్ళలో స్వల్ప వృద్ధి నెలకొంది. ముందస్తు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 24,000 కోట్ల రూపాయల నుంచి 33,000 కోట్ల రూపాయలకు పెరిగినట్టు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనంలో పేర్కొంది.
* మూడో వాయిదా తర్వాత అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు 2.47 లక్షల కోట్ల నుంచి 2.51 లక్షల కోట్లకు పెరిగింది.
* ఈ నెల 15 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు, నికర రిఫండ్స్ లో స్వల్ప వృద్ధి నమోదయింది.

ప్రత్యక్ష పన్ను వసూళ్లు
* బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం ప్రకారం సమీక్షా కాలంలో ప్రత్యక్ష పన్ను స్థూల వసూళ్లు 7.96 లక్షల కోట్ల నుంచి 8.34 లక్షల కోట్లకు పెరిగాయి. నికర పన్ను వసూళ్లు 6.7 లక్షల కోట్ల నుంచి 6.75 లక్ష కోట్లను తాకాయి.
* ఇదే కాలంలో రిఫండ్స్ 26.6 శాతం పెరిగాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications