కరోనా మహమ్మారి నేపథ్యంలో మే నుండి ఆగస్ట్ మధ్య 66 లక్షల మంది వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలు కోల్పోయారని, ఇందులో ఇంజినీర్లు, ఫిజిషియన్లు, టీచర్ల్ సహా వివిధ రంగాలనుండి ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) వెల్లడించింది. దీంతో ఉపాధి 2016 కనిష్టానికి క్షీణించిందని తెలిపింది. పారిశ్రామిక రంగాలకు గత నాలుగేళ్లలో వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయని, దీంతో 50 లక్షల మంది పరిశ్రామిక కార్మికులు ఉపాధి కోల్పోయినట్లు తెలిపింది. 20వ వేవ్ ఆఫ్ సీఎంఐఈ కన్స్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వే నివేదిక ప్రకారం కరోనా వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారు.

టెక్కీలు, డాక్టర్లు, టీచర్లు సహా వైట్ కాలర్ ఉద్యోగులు
CMIE ప్రతి నాలుగు నెలలకు ఓసారి ఈ జాబితాను విడుదల చేస్తుంది. వేతన ఉద్యోగుల్లో ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయింది వైట్ కాలర్ ప్రొఫెషనల్స్, ఇతరులు అని తెలిపింది. ఇందులో సాఫ్టువేర్ ఇంజినీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు, విశ్లేషకులు తదితరులు ఉన్నారు. వీరు వృత్తిపరంగా వివిధ ప్రయివేటు లేదా ప్రభుత్వ ఆర్గనైజేషన్‌లలో పని చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇందులో అర్హత కలిగిన స్వయం ఉపాధి ప్రొఫెషనల్ ఎంటర్‌ప్రెన్యూయర్స్ లేరు.

4 ఏళ్లలో ఉద్యోగంలో పొందినది అంతా కొట్టుకుపోయింది
మే - ఆగస్ట్ 2019లో మొత్తం దాదాపు 1.9 కోట్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ఉండగా, ఇవి గరిష్టమని, కానీ కరోనా కారణంగా ఈసారి 66 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఇప్పుడు 1.2 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది. 2016వ సంవత్సరం నుండి ఇది అత్యల్పం అని వెల్లడించింది. గత నాలుగేళ్లలో వారు సంపాదించిందంతా కరోనా కారణంగా ఇప్పుడు కొట్టుకుపోయిందని తెలిపింది.

పరిశ్రమలు ఎంత దెబ్బతిన్నాయో వెల్లడిస్తోంది
CMIE నివేదిక ప్రకారం ఆ తర్వాత ఎక్కువగా పారిశ్రామిక రంగంలో ఉంది. ఏడాది ప్రాతిపదికన 50 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి వాటా 26 శాతంగా ఉంది. పారిశ్రామిక ఉపాధి క్షీణత ఎక్కువగా చిన్న పరిశ్రమల్లో ఉందని తెలిపింది. ఇటీవలికాలంలో మధ్యస్థ, చిన్న, సూక్ష్మ పారిశ్రామిక విభాగాలు కరోనా వల్ల ఏ మేరకు దెబ్బతిన్నాయో ఈ ఉద్యోగాల కోత ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ కరోనా, లాక్ డౌన్ క్లరికల్ ఉద్యోగాలను ఎక్కువగా ప్రభావితం చేయలేదు. ఇందులో ఎక్కువగా కార్యదర్శులు, కార్యాలయ గుమాస్తా నుండి బీపీవో, కేపీవో వర్కర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నుండి రకరకాల డెస్క్ వర్క్ ఉద్యోగులు ఉన్నారు. ఏప్రిల్ నెలలో 12 కోట్లకు పైగా ఉద్యోగాలు పోయినట్లు గతంలో సీఎంఐఈ తెలిపింది.


Click it and Unblock the Notifications