చరిత్రలో అతి పెద్ద లేఆప్స్.. 17 లక్షల 70 వేల మందికి పైగా రోడ్డు మీదకు..అమెరికాలో ఉద్యోగ తొలగింపుల సంక్షోభం
2025 సంవత్సరంలో అమెరికాలో ఉద్యోగాల తొలగింపులు కోవిడ్ మహమ్మారి కాలం తర్వాత ఎప్పుడూ చూడని స్థాయికి చేరుకున్నాయి. జనవరి నుండి నవంబర్ వరకు, మొత్తం 1.17 మిలియన్ పైగా ఉద్యోగాలను కంపెనీలు తగ్గించాయి. ఇది 2024తో పోలిస్తే 54 శాతం ఎక్కువ. కేవలం నవంబర్ నెలలోనే 71,321 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది సంవత్సరాలలోనే అత్యధిక నవంబర్ తొలగింపులలో ఒకటిగా నమోదు అయింది. ఇది కార్మిక మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉందనే సంకేతాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ భారీ ఉద్యోగ కోతలను నడిపిస్తున్న రంగాలలో టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, రిటైల్, ప్రభుత్వ రంగాలు ముందంజలో ఉన్నాయి. టెలికాం సంస్థలు నవంబర్‌లో 15,139 ఉద్యోగాలను తగ్గించాయి, ఇది ఐదు సంవత్సరాలలో నమోదైన అత్యధిక నెలవారీ కోత. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్, HP వంటి టెక్ దిగ్గజాలు AI, క్లౌడ్, కార్పొరేట్ సేవలలో భారీ తిర్వ్యవస్థీకరణ చేపట్టాయి. అమెజాన్ ఒక్కటే 14 వేల ఉద్యోగాలను తొలగించింది. మొత్తం కోతలు 30 వేలకు చేరుకునే అవకాశం ఉంది. తొలగింపులలో దాదాపు 40 శాతం ఇంజనీరింగ్, టెక్ పాత్రలే ఉండటం, AI, ఆటోమేషన్ పట్ల పెరుగుతున్న ఆధారాన్ని చూపుతోంది.

రిటైల్, గిడ్డంగి రంగాల్లో కూడా ఉద్యోగాల తగ్గింపు విపరీతంగా పెరిగింది. రిటైల్ ఉద్యోగాల తొలగింపులు దాదాపు 90 వేలకు చేరుకోగా, గిడ్డంగి ఉద్యోగాలు కూడా 90వేలు దాటాయి. ప్రభుత్వ సంస్థలు కూడా ఈ ప్రభావానికి లోనయ్యాయి. అక్టోబర్ నాటికి 3 లక్షల కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు క్రమంగా తొలగించబడ్డాయి. మహమ్మారి తర్వాత భారీగావృద్ధి చెందిన రంగాలు ఇప్పుడు ఆర్థిక ఒత్తిడితో తిరిగి కుదింపు దశలోకి వెళ్లి US ఆర్థిక వ్యవస్థ అంతటా ఒక పెద్ద రీసెట్‌ను సూచిస్తున్నాయి.
ఈ తొలగింపులకు ప్రధాన కారణాల్లో ఒకటి AI, ఆటోమేషన్. నవంబర్‌లో 6,280 కంటే ఎక్కువ ఉద్యోగాలు AI ప్రభావంతో తొలగించబడ్డాయి. ఇక 2025 మొత్తం ఈ సంఖ్య 54 వేలను దాటింది. కంపెనీలు కార్యకలాపాలను సులభతరం చేయడానికి, వ్యయాలను తగ్గించడానికి AI వినియోగాన్ని వేగంగా పెంచుతున్నాయి. అయితే ఇది వేతనదారులకు భారీ నష్టంగా మారుతోంది. ముఖ్యంగా కార్పొరేట్, టెక్నికల్, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల్లో. AI పురోగమనం ఉత్పాదకతను పెంచుతున్నా, వేలాది మంది వారి ఉపాధిని కోల్పోతున్నారు.
అదేవిధంగా పునర్నిర్మాణం, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ద్రవ్యోల్బణం, వినియోగదారుల డిమాండ్ తగ్గడం ఉద్యోగాల కోతలకు కారణమవుతున్నాయి. నవంబర్‌లో పునర్వ్యవస్థీకరణ కారణంగా 20,217,మూసివేతల వల్ల 17,140*, మార్కెట్ ఒత్తిడి వల్ల 15,755 ఉద్యోగాలు రద్దు అయ్యాయి. చాలా కంపెనీలు ప్రస్తుతం No fire, no hire విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే కొత్త నియామకాలు లేకపోవడంతో పాటు ఉద్యోగాల కోతలు మాత్రం కొనసాగుతున్నాయి.
ఈ పరిణామాలు కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయి. ఖర్చులను తగ్గించడం, వినియోగాన్ని వాయిదా వేయడం, భద్రతాపరమైన ఆందోళన పెరగడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. విశ్లేషకులు కార్మిక మార్కెట్ 2026 వరకు ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈ తొలగింపులు అమెరికాలో ఉద్యోగ భవిష్యత్తు అస్థిరంగా మారుతున్నదని సూచిస్తోంది


Click it and Unblock the Notifications