IPOs 2021: ఐపీవోల జోరు, రూ.1.18 లక్షల కోట్లు సమీకరించిన కంపెనీలు
2021 సంవత్సరంలో ఐపీవోలు వెల్లువెత్తాయి. ఎప్పుడూ లేనంతగా నిధుల్ని సమీకరించాయి. ఇప్పటి వరకు మార్కెట్లో 63 ఐపీవోలు వచ్చి, రూ.1,18,704 కోట్లను సమీకరించాయి. 2020లో మొత్తం 15 ఐపీవోలు రాగా, రూ.26,613 కోట్లను సమీకరించాయి. అంటే 2020తో పోలిస్తే 2021లో నాలుగు రెట్లకు పైగా కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. అలాగే దాదాపు ఐదు రెట్ల మొత్తాన్ని సమీకరించాయి. ఇంతకుముందు ఐపీవోల ద్వారా 2017లో సమీకరించిన రూ.68,827 కోట్లు అధికం. ఇప్పుడు ఆ రికార్డ్ తుడిచి పెట్టుకుపోయింది. అంతేకాదు, 2017 కంటే ఒకటిన్నర రెట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని సమీకరించాయి.

రూ.2 లక్షల కోట్లకు పైగా
ఈ ఏడాది (జనవరి 1న) ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్‌తో ప్రారంభమైన ఐపీవో నిన్న (డిసెంబర్ 23) మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ వరకు చాలా ఐపీవోలు వచ్చాయి. ఇందులో కొన్ని స్టాక్స్ లిస్టింగ్ సమయంలో ఫెయిల్ కాగా, మరికొన్ని లిస్టింగ్ సమయంలో బంపర్ ధరతో ముందుకు వచ్చాయి. అలాగే, ఇష్యూ ధర, లిస్టింగ్ ధరతో పోలిస్తే ఇప్పుడు కొన్ని స్టాక్స్ నష్టాల్లో ఉండగా, మరికొన్ని లాభపడ్డాయి. లిస్టింగ్ రోజున భారీ లాభాలు వస్తుండటంతో, ఎక్కువమంది దరఖాస్తు చేశారు. అందుకే ఈ ఏడాది ఐపీవోలు లైన్ కట్టాయి. మొత్తం పబ్లిక్ ఈక్విటీ రూపంలో ఈ ఏడాది సమీకరించిన నిధుల మొత్తం రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంది.

పేటీఎందే అగ్రస్థానం
రూ.2 లక్షల కోట్లకు పైగా సమీకరించిన మొత్తంలో 51 శాతం అంటే రూ.1,03,621 కోట్లు తాజా మూలధన సమీకరణ కాగా, మిగతా రూ.98,388 కోట్లు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా వచ్చినవి. 2020లో ఇలా నమోదైన మొత్తం రూ.1,76,914 కోట్లు.
ఈ ఏడాది వచ్చిన ఐపీవోల్లో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్ పెద్దది. రూ.18,300 కోట్లను సమీకరించింది. తర్వాత జొమాటో రూ.9300 కోట్లు సమీకరించింది.

ఇష్యూకు సగటున 14.36 లక్షల దరఖాస్తులు
ఈ ఏడాది రిటైల్ ఇన్వెస్టర్ల నుండి ఆసక్తిని కనిపించింది. ఒక్కో ఇష్యూకు సగటున 14.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2020లో 12.77 లక్షలు, 2019లో 4.05 లక్షల దరఖాస్తులతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ. గ్లెన్ మార్క్ లైఫ్ సైన్సెస్ 33.95 లక్షలు, దేవయాని ఇంటర్నేషనల్ 32.67 లక్షలు, లేటెంట్ వ్యూ 31.87 లక్షలు అధిక సంఖ్యలో ఇన్వెస్టర్ల నుండి దరఖాస్తులను పొందాయి.
58 ఇష్యూల్లో 34 కంపెనీలు పది శాతానికి పైగా లాభాలను ఆర్జించాయి. సిగాచీ ఇండస్ట్రీస్ ఏకంగా 270 శాతం లాభాలు పంచింది. ఆ తర్వాత ఎక్కువ లాభాలు ఇచ్చిన వాటిలో పరాస్ డిఫెన్స్, లేటెంట్ వ్యూ ఉన్నాయి. ఈ ఏడాది సెబి వద్ద 115 కంపెనీలు ఐపీవో కోసం దరఖాస్తు చేసుకున్నాయి.


Click it and Unblock the Notifications