AP నిరుద్యోగులకు శుభవార్త: కొత్త ఉద్యోగాలకు టెంత్ పాస్! సచివాలయాలకు కటాఫ్ మార్కుల తగ్గింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు మరోసారి శుభవార్త. మిగిలిపోయిన 9,674 గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. అలాగే, వాలంటీర్ల పోస్టు భర్తీకి కొన్ని మార్పులు చేసింది. నవంబర్ 1న జిల్లాల వారీగా ప్రకటన జారీ చేసి 30వ తేదీలోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా ఎంపికయ్యే వాలంటీర్లు విధులకు హాజరయ్యేలా ఈ ప్రక్రియ ఉంటుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వలు జారీ అయ్యాయి.

పదో తరగతికి తగ్గిన విద్యార్హత
గ్రామ వాలంటీర్ పోస్టులకు కనీస విద్యార్హతను ఇంటర్ నుంచి పదో తరగతికి ప్రభుత్వం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో వాలంటీర్ల నియామకాన్ని చేపట్టిన ప్రభుత్వం మైదాన ప్రాంతాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి ఉండాలని నియమం పెట్టింది. మొదటిసారి 1,92,964 మంది గ్రామ వాలంటీర్ల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 1,83,290 మంది విధుల్లో చేరారు. మరో 9,674 పోస్టులకు మైదాన, గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేయడానికి అనుమతులు తెలుపుతూ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

18 నుంచి 35 ఏళ్ల వయస్సు..
2019 నవంబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల వయస్సు ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వీరు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంది. ఖాళీల సంఖ్య ఆధారంగా జిల్లాల వారీగా నవంబర్ 1వ తేదీన ఆయా జిల్లా కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు.

ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు..
ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా నవంబర్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య మండలాల వారీగా ఎంపీడీవో నేతృత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఎంపికైన వారికి 22వ తేదీ నాటికి సమాచారం ఇస్తారు. వారికి 29, 30 తేదీల్లో శిక్షణ ఇస్తారు. కొత్తగా ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కటాఫ్ మార్కుల తగ్గింపు
మరోవైపు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో భాగంగా బీసీ, ఓసీ అభ్యర్థుల కటాఫ్ మార్కులను తగ్గించనున్నారు. దీనిపై త్వరలో ప్రకటన వెలువడనుంది. బీసీ, ఓసీల కటాఫ్ మార్కులను 5 నుంచి 10 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన 47వేలకు పైగా పోస్టుల్లో 25వేల వరకు భర్తీ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కటాఫ్ మార్కులు ఇప్పటికే తగ్గించింది.


Click it and Unblock the Notifications