హైదరాబాద్ కు చెందిన రెండు దిగ్గజ హాస్పిటల్స్ కు మలేసియాకు చెందిన ఐహెచ్ హెచ్ హెల్త్ కేర్ గుడ్ బై చెప్పబోతోందా? ఈ హాస్పిటళ్లలో తనకున్న మొత్తం వాటాను విక్రయించాలనుకుంటోందా? ఇలాంటి సందేహాలకు అవుననే వార్తలు వెలువడుతున్నాయి. నగరానికి చెందిన కాంటినెంటల్ హాస్పిటట్స్ లో ఐహెచ్ హెచ్ కు 62.2 శాతం, గ్లోబల్ హాస్పిటల్స్ లో 74 శాతం వాటాలున్నాయి. అయితే ఈ వాటాలను తిరిగి ఈ హాస్పిటళ్ళ వ్యవస్థాపక ప్రమోటర్లకే విక్రయించాలని యోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చర్చలు కూడా ప్రారంభం అయ్యాయట.
భారీగా పడకలు
కాంటినెంటల్ హాస్పిటల్స్ క్రమంగా తన విస్తరణను చేపట్టింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్ లో 750 పడకలు ఉన్నాయి. గ్లోబల్ హాస్పిటల్స్ లో 2,000కు పైగా పడకలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ కు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లో హాస్పిటళ్లు ఉన్నాయి.
విభేదాలే కారణమా?
నాలుగేళ్ళ క్రితం కాంటినెంటల్ హాస్పిటల్ లో ఐహెచ్ హెచ్ హెల్త్ కేర్ 51 శాతం వాటాను తీసుకుంది. అప్పుడు ఈ వాటా విలువ దాదాపు రూ.281 కోట్లు. ఆ తర్వాత వాటాను 62 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాత గ్లోబల్ హాస్పిటల్ లో 74 శాతం వాటాను దాదాపు రూ.1,300 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే తర్వాతి కాలంలో హాస్పిటళ్ళ నిర్వహణ సరిగా లేకపోవడం, ప్రమోటర్ మధ్య విభేదాలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో తన వాటాలను విక్రయించుకోవడమే మేలన్న నిర్ణయానికి ఐహెచ్ హెచ్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

నష్టాలు..
కాంటినెంటల్ హాస్పిటల్ 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 55 కోట్ల రూపాయలు, 2016-17 సంవత్సరంలో 50 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకుంది. నికర అమ్మ కాలు 153 కోట్ల నుంచి 172 కోట్ల రూపాయలకు పెరిగాయి. కాగా ఆర్ధిక సంవత్సరం ప్రథమార్ధంలో గ్లోబల్ హాస్పిటల్స్ 10 కోట్ల రూపాయల ప్రతికూల స్థూల లాభాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే స్థూల లాభం తగ్గుతూ వచ్చింది. ఆదాయాల్లోనూ పెద్దగా మార్పు కనిపించడం లేదని ఈ వ్యవహారంతో సంభంధం ఉన్న వర్గాలు అంటున్నాయి. ఫోర్టిస్ కొనుగోలు విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐహెచ్ హెచ్ రెండు హాస్పిటళ్లలో వాటాలను తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి కంపెనీల యాజమాన్యాల నుంచి ధ్రువీకరణ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications