ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రానున్న 18 నెలల్లో 3 లక్షల మంది ఉద్యోగులను తీసుకోనుంది. అప్పుడు స్విగ్గీలో ఉద్యోగుల సంఖ్య ఏకంగా5 లక్షలకు పెరుగుతుంది. తన ప్రత్యర్థి సంస్థలకు ధీటుగా కస్టమర్లకు సేవలు అందించడంతో పాటు ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డ్ సృష్టించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా స్విగ్గీ నిరుద్యోగులకు ఓ శుభవార్త అందించింది.

3 లక్షల కొత్త ఉద్యోగాలు
రానున్న18 నెలల్లో 3,00,000 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు తెలిపింది. ఇదే జరిగితే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద సంస్థగా స్విగ్గీ అవతరిస్తుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేలలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఇండియన్ ఆర్మీలో 12.5 లక్షలు ఉండగా, ఇండియన్ రైల్వేలో రూ.12 లక్షల మంది ఉన్నారు.

టీసీఎస్‌ను దాటి.. ఎక్కువ ఉద్యోగులు కలిగిన కంపెనీగా..
మొత్తంగా 5 లక్షలమంది ఉద్యోగులను చేర్చుకుంటే స్విగ్గీ దేశంలోనే ఎక్కువ మంది ఉద్యోగులు కలిగిన ప్రయివేటు రంగ సంస్థగా నిలుస్తుంది. ప్రస్తుతం టీసీఎస్‌లో 4.5 లక్షల మంది ఉన్నారు. ఇదే వాస్తవమైతే టీసీఎస్‌ను దాటి పోతుంది. టీసీఎస్ టెక్ దిగ్గజం కావడంతో టెక్కీలు, స్విగ్గీ డెలివరీ యాప్ కావడంతో ఇందులో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువగా ఉంటారు. ఉద్యోగుల స్టేటస్ మాత్రమే తేడా. అంతేకాదు, మరో తేడా కూడా ఉంది.

ఈ ఉద్యోగులకు నో బెనిఫిట్స్!
ఇప్పుడు తీసుకునే ఉద్యోగులను డైరెక్టుగా స్విగ్గీ చేర్చుకోంది. వీరిని కాంటాక్ట్ బేసిస్ పైన చేర్చుకుంటుంది. కాబట్టి వీరికి పీఎఫ్ వంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. అదే సమయంలో కంపెనీ రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం ఈ ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం స్విగ్గీలో 2.1 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. జొమాటోలో 2,30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలోను పెద్ద ఎత్తున డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు.

స్విగ్గీ టార్గెట్..
స్విగ్గీ సహ వ్యవస్థాపకులు, సీఈవో శ్రీహర్ష మాట్లాడుతూ... తమ వృద్ధి అంచనాలు కొనసాగితే, ఆర్మీ, రైల్వేల తర్వాత దేశంలో మూడో అతిపెద్ద ఉపాధి వనరుగా మారడానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టదన్నారు. స్విగ్గీ ద్వారా ఏడాదికి 500 మిలియన్ ఆర్డర్లు 500 నగరాల్లో జరుగుతున్నాయి. కనీసం 100 మిలియన్ల కస్టమర్లు ప్రతి నెల 15 సార్లు స్విగ్గీ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరపాలనేది ఈ కంపెనీ లక్ష్యం. ఇది రానున్న పది, పదిహేనేళ్లలో నెరవేరుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications