వాషింగ్టన్: పెట్టుబడిదారులకు భారత్‌ను మించిన అత్యున్నత దేశం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, పెట్టుబడిదారులను గౌరవించే వాతారవరణం భారత్‌లో ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సదస్సులో ఆమె మాట్లాడారు. తమ ప్రభుత్వం నిత్యం కొత్త సంస్కరణలను తీసుకు వస్తోందని, అందుకు అనుగుణంగా పని చేస్తోందన్నారు.
ప్రపంచంలో వేగంగా ఆర్థికవృద్ధి జరుగుతున్న దేశాల్లో భారత్ ఉందన్నారు. అత్యంత నిపుణులైన ఉద్యోగాలు, సమాచం ఉందని, అలాగే ప్రభుత్వం కూడా అవసరమైన సంస్కరణలు ప్రోత్సహించేది ఉందని చెప్పారు. అన్నీ ప్రజాస్వామ్యయుతంగా, చట్ట ప్రకారం ఉంటున్నాయన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు అమలవుతున్నాయన్నారు.

భారతదేశంలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలి అనే ప్రశ్న ఎదురైంది. దానికి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ... కోర్టు వ్యవస్థ ద్వారా కాస్త ఆలస్యమైనప్పటికీ భారతదేశంలో పారదర్శకత ఉందన్నారు. పెట్టుబడిదారులకు ఆలస్యం జరగకుండా కూడా సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. చట్టాలు అమలవుతున్నాయన్నారు. తమ వద్ద ప్రజాస్వామ్యాన్ని ప్రేమించి, పెట్టుబడులను గౌరవించే వాతావరణం ఉందని చెప్పారు.
ఇదే సమయంలో జమ్ము కాశ్మీర్‌లో పెట్టుబడుల అంశంపై కూడా స్పందించారు. ఇక్కడ పర్యాటకరంగం, లలిత కళలు, హస్తకళలు, వుడ్ వర్క్, కార్పెట్స్, సిల్క్, ఆపిల్, కుంకుమ పువ్వు ఉత్పత్తులు వంటి వివిధ రంగాలలో పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. ఇందుకు సంబంధించి కొత్త పాలసీ త్వరలో అందరి ముందుకు వస్తుందన్నారు.


Click it and Unblock the Notifications