తొలి త్రైమాసికం జీడీపీ విస్మయానికి గురి చేసింది: ఆర్బీఐ గవర్నర్
2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాల కంటే తక్కువగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. వృద్ధి అంచనాల కంటే భారీగా తగ్గడం విస్మయ పరిచిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి వృద్ధి రేటును ఆర్బీఐ 5.8 శాతంగా అంచనా వేసింది. కానీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠంతో 5 శాతానికి పరిమితమైంది.
తమ అంచనాలు ఎక్కడ తప్పాయో విశ్లేషిస్తున్నామని ఆయన చెప్పారు. వృద్ధి గమనాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి చేపట్టిన పలు చర్యలతో ముందు ముందు త్రైమాసికాల్లో వృద్ధి మళ్లీ పుంజుకోవచ్చన్నారు. గత కొద్దినెలలుగా మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తోందన్నారు.

'మేము Q1 జీడీపీని 5.8 శాతంగా అంచనా వేశాం. వివిధ సంస్థలు కూడా 5.5 శాతానికి తగ్గకుండా ఉంటుందని ఊహించారు. కానీ వాస్తవ గణాంకాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అందరి అంచనాల కంటే తక్కువగా వచ్చాయి' అని శక్తికాంత దాస్ న్యూస్ ఛానల్ సీఎన్ఎన్ న్యూస్18తో అన్నారు. వీటికి కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే కేంద్ర ప్రభుత్వం అసలు లక్ష్యమని, దానికే తొలి ప్రాధాన్యత అన్నారు. జీడీపీని బలోపేతం చేయడానికే రెపో, రివర్స్ రెపో వడ్డీ రేట్లను తగ్గిస్తున్నామని అన్నారు. త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణలు ఈ పరిస్థితిని మెరుగుపరచగలవన్నారు. ఈ దిశగా ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications