న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ భారత్‌లో విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ టెక్ దిగ్గజం స్ట్రీమింగ్ రంగంలోకి కూడా భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా అడుగు పెడుతోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఆపిల్ టీవీ ప్లస్ పేరుతో నవంబర్ 1వ తేదీనుంచి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ప్రారంభిస్తుంది. భారత్ సహా వంద దేశాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

నవంబర్ 1 నుంచి Apple TV+
Apple TV+ భారత్‌లోను నవంబర్ 1వ తేదీ నుంచి యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. నెలకు కేవలం రూ.99 మాత్రమే (1.40 డాలర్లు). అమెరికాలో ఈ చందా 4.99 డాలర్లు. Apple TV+ సేవలు ఆపిల్ టీవీ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. నవంబర్ 1వ తేదీ నుంచి మొదట ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఏడు రోజుల తర్వాత ఫ్రీ ట్రయల్ ముగియగానే ఆటోమేటిక్‌గా రూ.99కి సబ్‌స్క్రిప్షన్ ఓకే అవుతుంది.

తక్కువ ధర, ఉచిత ఆఫర్లు..
Apple TV+ స్ట్రీమింగ్ ధరను భారీగా తక్కువకు నిర్ణయించడం, ఉచిత ఆఫర్లు, ప్రత్యేక కంటెంట్ ఉండటంతో దీనిపై అందరి దృష్టి పడింది. Apple TV+ ప్రకటన తర్వాత ఇప్పటికే ఈ రంగంలో ఉన్న నెట్ ఫ్లిక్స్ వంటి షేర్లు కుదేలయ్యాయి. ఆపిల్ చేతిలో రూ.15 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. వీటి సాయంతో స్ట్రీమింగ్ సర్వీస్‌లను అతి తక్కువ ధరకు ఇచ్చి, ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరువ కావాలని భావిస్తోంది.

వీటిపై సేవలు...
కొత్త ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ టీవీ, మ్యాక్, ఐపాడ్ టచ్‌లను కొనుగోలు చేస్తే ఏడాది పాటు ఆపిల్ టీవీ ప్లస్ సేవలు ఉచితం. భవిష్యత్తులో Apple TV+ సేవలు ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ టీవీలు, అమెజాన్ ఫైర్ టీవీ, ఎల్జీ, రోకు, సోనీ, విజియో ప్లాట్ ఫామ్స్ పైన కూడా అందుబాటులోకి వస్తాయి.

నెట్ ఫ్లిక్స్ ధరలు..
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ మొబైల్ ఓన్లీ స్ట్రీమింగ్ ప్లాన్ భారత్‌లో ప్రారంభ ధర రూ.199 నుంచి ఉంది. నెట్ ఫ్లిక్స్‌కు 13 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నెట్ ఫ్లిక్స్‌లో ప్రారంభ ధర రూ.199తో పాటు ఇప్పటికే రూ.499-రూ.799 మధ్య బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్స్ ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ ధరలు...
అమెజాన్ మంత్లీ అమెజాన్ ప్రైమ్ వీడియో కనీస ధర రూ.129గా ఉంది. ఏడాదికి రూ.999 స్కీం కూడా ఉంది. కానీ ఆపిల్ మాత్రం ఇప్పుడు వీటికి పోటాగా కేవలం రూ.99తో ముందుకు వస్తోంది. ఆపిల్ రాకతో భారత్‌తో సహా ప్రపంచ దేశాల్లో వీడియో స్ట్రీమింగ్ సేవలు కొత్త పుంతలు తొక్కనున్నాయి.

నవంబర్ 1 నుంచి 9 ఒరిజినల్ వీడియో షోలు..
Apple TV+ కుటుంబ సభ్యుల వరకు వీటిని వీక్షించవచ్చు. ప్రపంచవ్యాపతంగా విజవంతమైన 9 ఒరిజినల్ వీడియో షోలను నవంబర్ 1వ తేదీ నుంచి ఇందులో వీక్షించవచ్చు. ప్రత్యేక వీడియో కంటెంట్ కోసం నెట్ ఫ్లిక్స్ ఏడాదికి రూ.600 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వచ్చే రెండు మూడేళ్ల కోసం రూ.222 కోట్లు వెచ్చిస్తోంది. ఆపిల్ 6 బిలియన్ డాలర్లతో ముందుకొస్తోంది.


Click it and Unblock the Notifications