వాషింగ్టన్: అమెరికా - చైనా ట్రేడ్ వార్‌పై యూఎస్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు సానుకూల ప్రకటన చేశారు. ఇరుదేశాలు టారిఫ్స్‌తో వాణిజ్య యుద్ధానికి తెరలేపాయి. ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న ఈ రెండు దేశాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు సానుకూల సంకేతాన్నిచ్చాయి.
త్వరలో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నట్లు ట్రంప్ నేడు ప్రకటించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న G-7 సదస్సుకు హాజరైన ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిన్న రాత్రి చైనా అధికారుల నుంచి ఫోన్‌కాల్ వచ్చిందని, మళ్లీ చర్చలు మొదలుపెడతాని డ్రాగన్ కంట్రీ ప్రతిపాదన తెచ్చిందని, అతి త్వరలోనే ట్రేడ్ టాక్స్ జరుపుతామని తెలిపారు. చైనా అధికారులు రెండుసార్లు ఫోన్ చేశారని, అమెరికాతో ఒప్పందానికి రావాలని వాళ్లు భావిస్తున్నారని ట్రంప్ చెప్పారు.

అంతకుముందు, చైనాకు చెందిన లీహీ కూడా ప్రశాంతమైన వైఖరిలో సంప్రదింపులు, సహకారం ద్వారా సమస్య పరిష్కారానికి తాము సిద్ధమని ప్రకటించారు. వాణిజ్య యుద్ధం పెరగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ ట్రేడ్ వార్ ఇటు చైనాకు, అటు అమెరికాకు, ప్రపంచ ప్రజలకు కూడా మంచిది కాదన్నారు.
కాగా, ఇటీవల 500 బిలియన్ డాలర్లకు పైగా చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచింది. అమెరికా వస్తువులపై టారీఫ్స్ విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన తర్వాత ట్రంప్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ప్రపంచమంతా ఆర్థికమాంద్యం ఆందోళన నేపథ్యంలో ట్రేడ్ వార్ ఆపాలని G-7 దేశాలు సూచించాయి.


Click it and Unblock the Notifications