షాకింగ్: ఆగిపోయిన నియామకాలు, 45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కనిపిస్తోంది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్ మార్కెట్లు కూడా నష్టాల్ని చవిచూస్తున్నాయి. ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ వంటి పలు రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆటో సేల్స్ అయితే 20 ఏళ్ల కనిష్టానికి చేరి, వేలాది ఉద్యోగాలు దూరమవుతున్నాయి. భారతదేశంలో నిరుద్యోగత 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో నియామక ప్రక్రియలు మందకోడిగా ఉన్నాయి. మరోవైపు, ఆటో వంటి రంగాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు.

మందకోడిగా నియామక ప్రక్రియ
కేర్ రేటింగ్ లిమిటెడ్ స్టడీలో నియామక ప్రక్రియలు మందకోడిగా సాగుతున్నాయని తేలింది. బ్యాంకులు, ఇన్సురెన్స్, ఆటోమేకర్స్, లాజిస్టిక్స్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీల్లో హైరింగ్స్ చాలా మందగించాయని తేలింది. గత మార్చి ముగింపు సమయానికి దాదాపు 1,000 కంపెనీలు నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం కీలకమని, ఎక్కువ ఉద్యోగాల వృద్ధి ఈ రంగంలోనే ఉంటుందని వెల్లడించింది.

మోడీ ప్రభుత్వానికి సవాల్
పెరుగుతున్న నిరుద్యోగత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఇది భారత్‌లో పెట్టుబడుల అంశాన్ని కూడా మసకబారుస్తుంది. 2017లో ఉద్యోగాలు 5.44 మిలియన్లు ఉండగా, 2018 నాటికి 2078 మిలియన్లకు చేరుకుంది. అటే 6.2 శాతం. ముగిసిన మార్చి క్వార్టర్‌కు ఉద్యోగాల పెరుగుదల 4.3 శాతానికి తగ్గిపోయింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.03 మిలియన్లకు చేరుకుంది.

ఏ రంగంలో ఎలా అంటే...
రంగాలవారీగా చూస్తే హాస్పిటాలిటీలో ఔట్ సోర్సింగ్ పెరిగిందని కేర్ రేటింగ్ తెలిపింది. ఐరన్, స్టీల్, మైనింగ్ కంపెనీల్లో హెడ్ కౌంట్ తగ్గింది. వృద్ధి, ఉత్పత్తి తగ్గుదలతో పాటు దివాళా వంటి కారణాల వల్ల వీటిల్లో ఉద్యోగాలు తగ్గాయి. దేశంలో అత్యధిక ఒత్తిడి కలిగి ఉన్న సెక్టార్‌లలో బ్యాంకింగ్ రంగం ఒకటి. హైరింగ్‌లో ఇది కూడా ఆశించిన మేర లేదు.

నియామకాలు చేపట్టని బ్యాంకులు...
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్యాంకులు ఉద్యోగులను తీసుకోవడానికి బదులు తప్పనిసరి పరిస్థతుల్లో అవుట్ సోర్సింగ్, హేతుబద్దీకరణను ఆశ్రయించాయని కేర్ స్టడీ తెలిపింది. కొన్ని బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులు నియామకాలు అసలే చేపట్టలేదు. తమ మూలధనాన్ని పెంచుకునేందుకు, నిరర్థక లోన్స్ తగ్గించుకునేందుకు నియామకాలను నిలుపుదల చేశాయి.


Click it and Unblock the Notifications