న్యూఢిల్లీ: రైల్వేలో ప్రయాణం కాస్త ఖరీదు కానుంది! అయితే IRCTC వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకునే రైల్వే టిక్కెట్స్ ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. ఇదివరకు ఉన్న సర్వీస్ ఛార్జీలను ఇండియన్ రైల్వేస్ తిరిగి ప్రవేశ పెట్టే అవకాశముందని చెబుతున్నారు. ఈ సర్వీస్ ఛార్జీ రూ.20 నుంచి రూ.40 మధ్య ఉండే అవకాశముంది.

రైల్వే ప్రయాణీకులపై ప్రత్యక్ష భారం
సర్వీస్ ఛార్జీని రెండు కేటగిరీల్లో విధించవచ్చు. అయితే ఈ ఛార్జీ పైన తుది నిర్ణయం మాత్రం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖదే. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కానీ ఇండియన్ రైల్వేస్ మాత్రం సర్వీస్ ఛార్జీని తిరిగి పునరుద్ధరించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే రైల్వే ప్రయాణీకులపై ప్రత్యక్ష భారం పడనుంది.

ఎంత వసూలు చేయవచ్చు?
మీడియాలో వస్తున్న సమాచారం మేరకు.. IRCTC ఈ-టిక్కెట్ బుకింగ్స్ పైన సర్వీస్ ఛార్జీలు వసూలు చేసేందుకు సమాయత్తమవుతోంది. స్లీపర్, ఏసీ క్లాస్‌లలో ఈ-టిక్కెట్ బుకింగ్స్ పైన వరుసగా రూ.20, రూ.40 వసూలు చేసే అవకాశముంది.

ఈ-టిక్కెట్ బుకింగ్స్
ఈ మేరకు ఈ-టిక్కెట్ బుకింగ్స్ పైన సర్వీస్ ఛార్జీ విధించాలని కోరుతూ ఆర్థిక శాఖ.... రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లుగా తెలిసిందని జీ బిజినెస్ పేర్కొంది. భారతీయ రైల్వేకు కంపెన్షేషన్ కింద రావాల్సిన రూ.88 కోట్ల నిధులను ఇచ్చేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ నిరాకరించిందట. అయితే ఈ-టిక్కెట్స్ బుకింగ్స్ పైన సర్వీస్ ఛార్జీలు విధించాలని సూచించిందని తెలుస్తోంది.

పెద్ద నోట్ల సమయంలో రద్దు
పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ సర్వీస్ ట్యాక్సును తొలగించారు. ఈ-టిక్కెట్ల పైన సర్వీస్ ఛార్జీని మినహాయించాలని, ఆ భారాన్ని తామే భరిస్తామని అప్పుడు రైల్వే శాఖకు ఆర్థిక శాఖ సూచించింది. అయితే ఇప్పుడు దానిని భరించలేమని తేల్చి చెప్పిందట. అప్పటి వరకు స్లీపర్ క్లాస్ టిక్కెట్ పైన రూ.20, ఏసీ కోచ్ టిక్కెట్ పైన రూ.40 చొప్పున సర్వీస్ ట్యాక్స్ విధించారు.

అందుకే మళ్లీ సర్వీస్ ట్యాక్స్
నోట్ల రద్దు సమయం నుంచి ఆర్థిక శాఖ దీనిని చెల్లిస్తూ వస్తోంది. అయితే అయితే, పన్ను రద్దు కారణంగా తమకు రూ.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, దానిని చెల్లించాలని రైల్వే శాఖ ఇటీవల ఆర్థికశాఖకు డిమాండ్ నోటీసు పంపించింది. దీనిపై స్పందించిన ఆర్థిక శాఖ... సర్వీస్ ట్యాక్స్‌కు సమానమైన మొత్తాన్ని తాము చెల్లించడమన్నది తాత్కాలిక వెసులుబాటు మాత్రమేనని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ మొత్తాన్ని రాబట్టుకోవాలని సూచించింది. ఈ భారాన్ని భరించలేమని తెలిపింది. దీంతో రైల్వే శాఖ ఈ-టికెట్స్ బుకింగ్స్ పైన మళ్లీ సర్వీస్ ట్యాక్స్ విధించే యోచన చేస్తోందని తెలిస్తోంది.


Click it and Unblock the Notifications