అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, చెన్నైలోని జపాన్ కాన్సులేట్ కోజిరో ఉచియామా సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో జపాన్ కంపెనీల పెట్టుబడులపై వీరు చర్చించారు. పెట్టుబడులతో రావాలని జగన్ కోరారు. ఏపీలో ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే భూములు కేటాయించేందుకు సిద్ధమన్నారు. జపాన్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని కాన్సులేట్ అన్నారు.
రండి... ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడతాం
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ (బస్సులు) ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నామని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జగన్ జపాన్ కాన్సులేట్‌ను కోరారు. పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా భాగస్వామ్యం ఉండాలన్నారు. అత్యాధునిక పోర్టులు, మౌలిక వసతులు, వనరులు అందుబాటులో ఉన్నాయని, జపాన్ నుంచి కంపెనీలు వస్తే అన్ని విధాలా అనుకూలమని చెప్పారు.

పరిశ్రమలు, ఇన్వెస్టర్లకు మద్దతుగా బిల్లు
ఏపీలో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు, వేర్‌హౌస్‌లు, అగ్రి ల్యాబ్‌లతో పాటు ఇతర పెట్టుబడులకు అవకాశాలు పరిశీలించాలని జగన్ కోరారు. ఏపీలో అవినీతిలేని పాలన, పారదర్శకత కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామని జపాన్ కాన్సులేట్‌కు చెప్పారు. దీంతో భూములు, నీరు, విద్యుత్ రేట్లు తగ్గి పారిశ్రామికవర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఇటీవలే ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ యాక్ట్ బిల్లు పాస్ చేశామని, ఇది పరిశ్రమలు, ఇన్వెస్టర్లకు మద్దతుగా ఉంటుందన్నారు.

75 శాతం ఉద్యోగాలు స్థానికులకు.. వ్యతిరేకత ఉండదు
పారిశ్రామికరంగంలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా జగన్ స్పష్టం చేశారు. కాబట్టి పరిశ్రమల ఏర్పాటుకు స్థానికుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదని తెలిపారు. పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్యతను పెంచేందుకు ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జపాన్‌లో పర్యటించవలసిందిగా ఉచియామా.... జగన్‍ను ఆహ్వానించారు.

ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి
అనంతరం కాన్సులేట్ కోజిరో ఉచియామా చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మంచి స్థానంలో ఉన్నందున జపాన్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని ఈ సందర్భంగా ఉచియామా అన్నారు. ఇప్పటికే జపనీస్ అగ్రికల్చర్, ఫిషరీస్, ఫుడ్ మంత్రిత్వ శాఖ ఫిషరీస్ రాష్ట్రంలో ఇండస్ట్రీ అవకాశాలు, ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుదల అంశాలపై పరిశీలిస్తోంది.


Click it and Unblock the Notifications