న్యూఢిల్లీ: లక్షలాది మంది ఉద్యోగులకు ఇండియన్ రైల్వేస్ షాకివ్వనుంది. సక్రమంగా పని చేయని వారిని విధుల నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 55 ఏళ్లకు మించిన వారు ఈ జాబ్ కట్ ఎదుర్కోనున్నారు. ఈ మేరకు జోనల్ ఆఫీసర్లకు రైల్వే శాఖ లేఖ రాసింది. సక్రమంగా విధులు నిర్వర్తించని వారి జాబితాను తయారు చేయాలని సూచించింది.

జాబితా తయారు చేయండి
ఇండియన్ రైల్వేలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులను తొలగించవచ్చు. 55 ఏళ్లు దాటిన, సక్రమంగా విధులు నిర్వర్తించని ఉద్యోగులను వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్) తీసుకోవాలని కోరనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జోన్ల అధికారులకు జాబితా తయారు చేయాలని లేఖలు రాసింది. ఉద్యోగుల పర్ఫార్మెన్స్‌పై రిపోర్ట్ తయారు చేయాలన్నారు. 2020 నాటికి రైల్వేలో ముప్పై ఏళ్లుగా పని చేస్తున్న, 55 ఏళ్లు నిండిన జాబితాను తయారు చేయాలని కోరింది.

4 అంశాల ఆధారంగా ఆగస్ట్ 9 లోపు జాబితా
అన్ని రైల్వే జోనల్ మేనేజర్లు.. స్టాఫ్ మెంబర్స్ పర్ఫార్మెన్స్, వారి సర్వీస్ రికార్డులను సిద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఫిట్‌నెస్‌తో పాటు డెయిలీ అటెండెన్స్, వారి క్రమశిక్షణ ఆధారంగా జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు జోనల్ ఆఫీసర్లకు జూలై 27వ తేదీన లేఖలు పంపించారు. ఆగస్ట్ 9వ తేదీలోపు జాబితా ఇవ్వాలని ఆదేశించారు.

13 లక్షల నుంచి 10 లక్షలకు తగ్గనున్న ఉద్యోగులు
ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్‌లో 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ చర్యతో ఉద్యోగుల సంఖ్య 10 లక్షలకు తగ్గనుంది. రైల్వే శాఖలో అవినీతి అధికారుల ప్రొఫైల్స్‌ను స్టడీ చేస్తున్నామని, సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల కేంద్ర రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలా చెప్పిన పక్షం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

వీఆర్ఎస్
ఉద్యోగుల పనితీరును నిర్ణీత కాలవ్యవధిలో సమీక్ష జరుపుతుంటామని, అందులో భాగంగానే వివరాలు సేకరిస్తున్నామని, తగిన ప్రమాణాల మేరకు పనిచేయని వారిని, క్రమశిక్షణచర్యలకు గురైనవారిని వీఆర్ఎస్ తీసుకోమని చెప్పనున్నామని అధికారులు చెబుతున్నారట. సి, డి గ్రేడ్ ఉద్యోగులకు సంబంధించి గత ఐదేళ్ళలో సర్వీస్ రిజిస్టర్‌లలో నమోదు చేసిన వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన వివరాలను పొందుపరచాలని సూచించారు.

ఈ నాలుగింటితో పాటు...
శారీరక, మానసిక సామర్థ్యం, అటెండెన్స్, క్రమశిక్షణ అనే నాలుగు అంశాలతో పాటు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా, తనిఖీలు ఎలా ఉన్నాయి, ఖర్చు విషయంలో ఎలా ఉంది, కిందిస్థాయి ఉద్యోగులతో వారి ప్రవర్తన తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.


Click it and Unblock the Notifications