కస్టమర్లకు ఎయిర్‌టెల్ భారీ షాక్, బ్యాలెన్స్ ఉన్నా రీచార్జ్ చేయాలి!
న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. ఈ టెలికం కంపెనీ తాజా నిర్ణయంతో ఎయిర్‌టెల్ కస్టమర్లు తప్పనిసరిగా వారం రోజులకే రీచార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి. భారత దేశంలో టెలికం రంగంలో ఇటీవల ఎన్నో మార్పులు చూస్తున్నాం. ఇప్పటి వరకు టెలికం రంగంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వొడాఫోన్ - ఐడియా, ఎయిర్‌టెల్‌లను మూడేళ్ల క్రితం వచ్చిన జియో దాటేసింది. ప్రస్తుతం కస్టమర్ బేస్ పరంగా జియో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ఉన్నాయి.

ఇప్పటికే మినిమం రీచార్జ్ పథకం
ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్, వొడాపోన్ ఐడియాలు లాభాలను ఆర్జించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే కొద్ది నెలల క్రితం మినిమం రీచార్జ్ పథకాన్ని తీసుకు వచ్చాయి. కనీస రీచార్జ్ స్కీంను ఈ రెండు టెలికం కంపెనీలు అమలు చేస్తున్నాయి.

15 రోజుల నుంచి 7 రోజులకు కుదింపు
తాజాగా, ఎయిర్‌టెల్ మరో స్కీంను తెరపైకి తెచ్చింది. పోస్ట్ పెయిడ్ సబ్ స్క్రైబర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు వ్యాలిడిటీ ముగిసిన తర్వాత 15 రోజుల వరకు సబ్‌స్క్రైబర్ ఇన్‌కమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో ఎయిర్‌టెల్ మార్పులు చేసింది. ఇక నుంచి దీనిని వారం రోజులకు (7 రోజులు) తగ్గించింది. అంటే ఎయిర్‌టెల్ కస్టమర్ తాను ఎంచుకున్న ప్లాన్ ముగిసిన తర్వాత ఏడు రోజుల తర్వాత కూడా బ్యాలెన్స్ వేసుకోకుంటే ఇన్‌కమింగ్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోలేడు.

బ్యాలెన్స్ ఉన్నా వ్యాలిడిటీ దాటితే రీచార్జ్
ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్ల అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ సబ్‌స్క్రైబర్ వ్యాలిటిడీ ముగిసిన వారం తర్వాత కూడా రీచార్జ్ చేయకుంటే వాయిస్ కాల్స్ అందుకోలేరు. యూజర్ నుంచి ARPU అంటే సగటు రాబడిని పెంచుకునేందుకు ఎయిర్‌టెల్ దీనిని తీసుకు వచ్చింది. ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్ల కోసం వొడాఫోన్ ఐడియా కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇది నష్టమా?
ఇప్పటికే రిలయన్స్ జియో కారణంగా ఇతర టెలికం సంస్థలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ARPU పెంచుకునేందుకు ఎయిర్ టెల్ ఈ స్కీంను తెరపైకి తెచ్చినప్పటికీ, ఇది ఎయిర్‌టెల్‌కే దెబ్బ అంటున్నారు. యూజర్లు ఇతర టెలికం సర్వీస్‌ల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications