గుత్తాధిపత్యాన్ని సహించేది లేదు: టెలికం కంపెనీలకు కేంద్రం
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఆరోగ్యకర పోటీని ప్రభుత్వం కోరుకుంటోందని, అదే సమయంలో గుత్తాధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రోత్సహించేది లేదని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. కేంద్రమంత్రి టెలికం కంపెనీ సీఈవోలతో శనివారం భేటీ అయ్యారు. ఈ భేటీకి భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సీఈవో, కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.
సమస్యలను పరిష్కరించేందుకు, టెలికం కంపెనీలకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశం గంటకు పైగా జరిగింది. భారతీ ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విఠల్, వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ, రిలయన్స్ జియో బోర్డు మెంబర్ మహేంద్ర నహత, బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పుర్వార్ హాజరయ్యారు.

5జీ ఆవిష్కరణలు, స్టార్టప్స్, 5జీ ఉత్పత్తుల సృష్టి వంటి అంశాలను తాను ప్రస్తావించానని రవిశంకర ప్రసాద్ ఆ తర్వాత మీడియాతో చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్‌లో 25 శాతం టెలికం సెక్టార్‌ది ఉండాలని తాను చెప్పానన్నారు. ప్రభుత్వం వైపు నుంచి వారికి ఏం చేస్తామో చెప్పామన్నారు. ముఖ్యంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పెండింగులో ఉందని పేర్కొన్నానని అన్నారు. జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించామన్నారు. టెలికం సేవల నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని తాను టెలికం కంపెనీలని కోరానన్నారు.
ప్రస్తుతం 43,000 గ్రామాలు అనుసంధానం కాలేదని, ఓ సంవత్సరంలో ఆ టెలికం ఇండస్ట్రీ ఆ గ్రామాలకు చేరుకోవాలని చెప్పానని, వారు కూడా అందుకు అంగీకరించారన్నారు. టెలికం విభాగం (DoT) అందుకు సహకారం అందిస్తుందని చెప్పారు. టెలికం కంపెనీలకు తాను ప్రధానంగా మూడు విషయాలు చెప్పానని, ప్రభుత్వం ఆరోగ్యకరమైన పోటీ కోరుకుంటుందని, ఎలాంటి గుత్తాధిపత్యాన్ని అంగీకరించేది లేదని, అలాగే, టెలికం కంపెనీలకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పామన్నారు.


Click it and Unblock the Notifications