ఈ ఏడాది చివరికల్లా వాట్సాప్ పేమెంట్ సేవలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ త్వరలో తన పేమెంట్ యాప్‌ను తీసుకు రానుంది. వాట్సాపే పేమెట్ సర్వీస్‌లు వస్తాయని ప్రకటించిన తర్వాత చాలా రోజులు అయినా అమల్లోకి రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సేవలు త్వరలో ప్రారంభిస్తున్నట్లు వాట్సాప్ గ్లోబల్ హెడ్ తెలిపారు. 2019 చివరికల్లా సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ఓసారి దీనికి సంబంధించి అనుమతులు వచ్చాక భారత్‌లో వినియోగదారులందరికీ ఏడాది చివరికల్లా పేమెంట్ సర్వీస్‌లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

డిజిటల్ ఎకానమీలో భాగస్వామ్యం
పేమెంట్ యాప్ ద్వారా తాము కూడా డిజిటల్ ఎకానమీలో భాగస్వాములం అవుతామని చెప్పారు. తమ మెసేజింగ్ సేవల వలే పేమెంట్ యాప్ నుంచి సులభంగా డబ్బులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకరి నుంచి మరొకరికి డబ్బులు పంపించుకునేందుకు, యూపీఐ ఆధారిత సేవల కోసం ఉపయోగించేలా తీసుకురానుంది. వాట్సాప్ పే దాదాపు 300 మిలియన్ యూజర్లకు సేవలు అందుబాటులోకి తీసుకురానుంది.

ఆ పేమెంట్ యాప్స్‌కు పోటీ
ముఖ్యంగా దేశంలోని చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు (SMBలు) సేవలను అందిస్తుంది. వాట్సాప్ పేమెంట్ యాప్‌ను గత ఏడాది 1 మిలియన్ యూజర్లతో టెస్ట్ రన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ టెస్ట్ చివరి దశలో ఉంది. ఇప్పటికే భారత్‌లో పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి పలు పేమెంట్ యాప్స్ ఉన్నాయి. వాటికి వాట్సాప్ పేమెంట్ యాప్ పోటీ కానుంది.

అందుకే నిలిచిపోయింది...
డేటా స్టోరేజీ వంటి పలు అంశాల కారణంగా వాట్సాప్ పేమెంట్ యాప్ సేవల ప్రారంభం నిలిచింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో ఆలస్యమైంది. అయితే పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను భారత్‌లోనే స్టోర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది. ఆర్బీఐ నిబంధనల మేరకే తాము పేమెంట్ సేవలు ప్రారంభిస్తామని సుప్రీం కోర్టులోను తెలిపింది.


Click it and Unblock the Notifications