అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ బ్యాంక్ రుణం వస్తుందని అందరూ ఆశించారు. కానీ అది వెనుకంజ వేయడంతో ప్రభుత్వంతో పాటు రాజధానికి భూమిచ్చిన రైతులు, రాష్ట్ర ప్రజలు షాకయ్యారు. ప్రపంచ బ్యాంకు రుణం ఆగిపోవడంపై వైసీపీ, టీడీపీ మధ్య వాగ్యుద్ధం కూడా నడిచింది. ఈ రుణం ఆగిపోవడంపై వివిధ రకాల వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అమరావతికి ఆర్థిక సాయం ఉపసంహరించుకోవడానికి గల కారణాలను వరల్డ్ బ్యాంకు తాజాగా స్పష్టం చేసింది.
చదవండి: జగన్ అనూహ్య నిర్ణయం, ఒక్క రూపాయికే పంటబీమా: ఇలా చేరండి

అందుకే ఆర్థిక సాయం ఉపసంహరణ
కేంద్ర ప్రభుత్వం సూచనతోనే ఏపీ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం ఉపసంహరించుకున్నట్లు ప్రపంచబ్యాంకు తెలిపింది. రాజధాని మౌలిక వసతులకు ఉద్దేశించిన అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు కోసం రుణం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్రం సూచన మేరకు ఈ నెల 15వ తేదీన రుణ ప్రతిపాదనను రద్దు చేసుకున్నట్లు, కేంద్రానికి లేఖ రాసినట్లు వరల్డ్ బ్యాంకు తెలిపింది.

ఐనా 1 బిలియన్ డాలర్ల సాయం
అమరావతి ప్రాజెక్టు నుంచి తాము తప్పుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అబివృద్ధికి మాత్రం సహకరిస్తామని వరల్డ్ బ్యాంకు తెలిపింది. ఏపీ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపితే పరిశీలించిన అనంతరం సహకారం ఉంటుందని తెలిపింది. హెల్త్, అగ్రికల్చర్, ఇంధనం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో బిలియన్ డాలర్ల సహకారాన్ని అందిస్తామని అందిస్తున్నామని తెలిపింది. ఆరోగ్య రంగంలో 328 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు గత నెల 27న అగ్రిమెంట్ పైన సంతకాలు చేసినట్లు తెలిపింది.

భారత ప్రభుత్వం కోరిన ఏ సాయమైనా ఏపీకి చేసేందుకు సిద్ధం
ప్రభుత్వం ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్దేశిస్తున్నందున, రాష్ట్రానికి.. అలాగే భారత ప్రభుత్వం కోరిన ఏ సహాయమైన అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం 300 మిలియన్ డాలర్ల రుణ ప్రతిపాదన ఉపసంహరణ అనంతరం ప్రపంచ బ్యాంకు నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

రుణ పరిమాణం పెంచే అవకాశముంది
ఏపీ ప్రభుత్వానికి ప్రాధాన్యతలను బట్టి రుణాలు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు విముఖత చూపలేదు. రుణ పరిమాణం పెంచే అవకాశం కూడా బ్యాంక్ తోసిపుచ్చలేదని ఏపీకి చెందిన అధికారి తెలిపారు. అమరావతి మినహా ఏపీలోని ఇతర ప్రాజెక్టులకు రుణ సాయానికి ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

అందుకే ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిందా?
గతంలో ప్రపంచ బ్యాంకు అధికారులు అమరావతిలో పర్యటించారు. ఇక్కడ అవకతవకలు గుర్తించినట్లుగా వార్తలు వచ్చాయి. టెండర్ ప్రక్రియలో అవకతవకలు గుర్తించారని అంటున్నారు. అదే సమయంలో ల్యాండ్ పూలింగ్, వ్యవసాయ భూములను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం, వ్యవసాయ కార్మికులు జీవనోపాధి కోల్పోవడం, తీవ్రమైన పర్యావరణ ఉల్లంఘనలు, కృష్ణ నది గమనాన్ని ప్రభావితం చేసే కొత్త ప్రతిపాదిత మూలధనం యొక్క ప్రణాళిక, ఇతర సమస్యలను కూడా వారు గుర్తించారని తెలుస్తోంది. ఈ అంశాలపై ప్రపంచ బ్యాంకు CRDAను వివరణ కోరగా, దీనిపై సంతృప్తికర సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెనక్కి వెళ్లిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications