హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పింఛన్‌దారులకు శుభవార్త. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు డబుల్ చేశారు. ఈ పెంచిన పెన్షన్లు అమలులోకి రానున్నాయి. ఇందుకోసం ఈ నెల 20వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలవారీగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పెంచిన పెన్షన్లను జూన్ నెల నుంచి వర్తింప చేయాలని నిర్ణయించారు.

పెన్షన్ రెండింతలు.. జూన్ నుంచి అమలు
పెన్షన్లను రెండింతలు చేశారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.2016కు, దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు ఇచ్చే పెన్షన్ రూ.1500 నుంచి రూ.3016కు పెంచాలని నిర్ణయించారు. వీటిని ఈ జూన్ నుంచి అమలు చేస్తారు. జూన్ నెల పెన్షన్‌ను ఈ నెల (జూలై)లో లబ్ధిదారులకు అందిస్తారు.

రూ.12వేల కోట్ల భారం
పెంచిన పెన్షన్లకు సంబంధించి ప్రొసీడింగ్స్‌ను ఈ నెల 20న అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా లబ్ధిదారులకు అందిస్తారు. పెన్షన్ల పెంపు కారణంగా ప్రభుత్వంపై ఏడాదికి రూ.12వేల కోట్లు భారం పడనుంది. ఇందులో రూ.11,800 కోట్లు రాష్ట్రం, రూ.200 కోట్లు కేంద్రం భరిస్తాయి.

వయో పరిమితి 8 ఏల్లు తగ్గింపు
వృద్ధాప్య పెన్షన్ అర్హత వయో పరిమితిని 65 ఏళ్ల వయస్సు నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి 8 ఏళ్లు తగ్గించారు. ఎన్నికలకు తెరాస హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు 57 ఏళ్లు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే తయారు చేయాలని అధికారులను కేబినెట్ కోరింది. సాధ్యమైనంత త్వరగా జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పెన్షన్ అందిస్తారు. అలాగే, బీడీ కార్మికులకు PF కటాఫ్ డేట్‌ను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. 2019 జూలై 17 వరకు PF ఖాతా ఉన్న కార్మికులకు పెన్షన్ అందించాలని అధికారుల్ని ఆదేశించారు.


Click it and Unblock the Notifications