వరుసగా ఆస్తులు విక్రయిస్తున్న అనిల్ అంబానీ, తాజాగా మరో దెబ్బ
ముంబై: అనిల్ అంబానీ వరుసగా తన ఆస్తులు అమ్ముతూ రుణాలు చెల్లిస్తున్నారు. రోడ్ల నుంచి రేడియో స్టేషన్ వరకు పలు అసెట్స్ విక్రయించి రూ.217 బిలియన్లు (3.2 బిలియన్ డాలర్లు) సమీకరించి, రుణాలు చెల్లించేందుకు ఉపయోగిస్తున్నారు. ముంబైలోని హెడ్ ఆఫీస్‌ను కూడా లీజుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 9 రోడ్డు ప్రాజెక్టులకు రిలయన్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ రూ.90 బిలియన్ డాలర్లు కోరుతోంది. రేడియో యూనిట్ విక్రయం ద్వారా రూ.10 బిలియన్ డాలర్లు, ఫైనాన్షియల్ బిజినెస్‌లో హోల్డింగ్స్ ద్వారా 115 బిలియన్ డాలర్లు సమీకరించాలని రిలయన్స్ కేపిటల్ లిమిటెడ్ భావిస్తోంది.

రుణ విముక్తం కావాలని...
ప్రస్తుతం అనిల్ అంబానీ రుణాలు తీర్చడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల 11వ తేదీన ఆయన మాట్లాడుతూ... రిలయన్స్ గ్రూప్ గత 14 నెలల కాలంలో ఆస్తులు విక్రయించి రూ.350 రుణాలు చెల్లించిందని చెప్పారు. అయినప్పటికీ అనిల్‌కు చెందిన టాప్ 4 కంపెనీలకు సంబంధించి రూ.939 బిలియన్ల డెబిట్స్ ఉన్నాయి. రానున్న మార్చి 2020 నాటికి రుణాలన్ని చెల్లించాలని అనిల్ అంబానీ భావిస్తున్నారు.

ఎస్బీఐ విచారణ
ఇదిలా ఉండగా, అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు మరో రెండు సంస్థలకు చెందిన పద్దు పుస్తకాల్లో దాదాపు రూ.5,500 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఎస్బీఐ గుర్తించిందని తెలుస్తోంది. ఆర్.కామ్., రిలయన్స్ టెలికం, రిలయన్స్ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధులపై విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటికి సంబంధించిన లావాదేవీలను కూలంకషంగా పరిశీలించే అవకాశముంది.

నిధుల మళ్లింపు జరిగిందా?
మే 2017 నుంచి మార్చి 2018 మధ్య కాలంలో జరిగిన లావాదేవీలపై ఎస్బీఐ దృష్టి సారించింది. 100,000కు పైగా నమోదిత వివరాలను పరిశీలించింది. ఈ మూడు కంపెనీల ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ఎస్బీఐ సారథ్యంలోని కన్సార్టియం... నిధుల మళ్లింపు జరిగిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో లోతైన దర్యాఫ్తు చేపట్టాలని భావిస్తున్నారట. 2017 మే నెలలో అంతగా ప్రముఖ్యం లేని కంపెనీకి రిలయన్స్ గ్రూప్ నుంచి రూ.4,000 కోట్ల నిధులు వెళ్లినట్లుగా తేలిందని సమాచారం. దీనికి సంబంధించి ఆడిటర్ల నివేదిక కూడా లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications