కోటీశ్వరులపై భారత్‌లో పన్ను చాలా తక్కువ, ఆ దేశాల్లో 50 శాతానికి పైగా...
న్యూఢిల్లీ: రూ.2 కోట్లు అంతకు మించి సంపాదిస్తున్న వారిపై 25శాతం నుంచి 37శాతం చొప్పున పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ విదేశాల్లోని సంపన్నుల కంటే మన సంపన్నులపై విధిస్తున్న పన్ను తక్కువేనట. అమెరికా, దక్షిణాఫ్రికా, చైనాలతో పోల్చితే భారత్‌లో సూపర్ రిచ్‌లపై విధిస్తున్న పన్ను ఇంకా తక్కువస్థాయిలోనే ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సూపర్ రిచ్‌లపై విధిస్తున్న పన్నును 37 శాతానికి పెంచటాన్ని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సమర్థించారు. చైనా, దక్షిణాఫ్రికాల్లో సూపర్ రిచ్‌లపై విధిస్తున్న పన్ను 45 శాతంగా ఉండగా అమెరికాలో 50.3 శాతంగా ఉందన్నారు. యూకేలో ఇది 45 శాతం, జపాన్‌లో 45.9 శాతం, కెనడాలో 54 శాతం, ఫ్రాన్స్‌లో 66 శాతంగా ఉంది.

రూ.2 నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారిపై ఆదాయ పన్నును 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్లకు పైబడి ఆదాయం ఉన్న వారిపై పన్నును 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు.
ఈ పెంపుకు ముందు, ఇండియాలో హయ్యెస్ట్ ట్యాక్స్ రేట్ 35.88 శాతంగా ఉందని, మిగతా దేశాల్లో ఎంతో ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. భారత్‌లో హయ్యెస్ట్ పర్సనల్ ఐటీ రేట్ 35 శాతంగా ఉందన్నారు. రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారు, అలాగే రూ.10 కోట్ల ఆదాయం కలిగిన వారు ఒకే రకమైన పన్ను చెల్లిస్తున్నారని, ఇది సరికాదన్నారు.
కోట్లాది రూపాయలు సంపాదించుకునే వారికి సమానంగా లక్షలు సంపాదించుకునే వారు కట్టడం సరికాదని, లక్షలు సంపాదించుకునే వారు కొంత వెనుకేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రూ.2 కోట్లకు పైగా సంపాదించే వారిపై పన్ను పెంచినట్లు తెలిపారు. వారిపై వరుసగా 3 శాతం, 7 శాతం పెరగాలన్నారు.


Click it and Unblock the Notifications