వాషింగ్టన్: అమెరికా - చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. ఒసాకాలో జరిగిన జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్‌లో ఓ అంగీకారానికి వచ్చారు. ఆగిపోయిన వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. వివాదం పరిష్కారమయ్యే వరకు చైనా ఉత్పత్తులపై కొత్తగా టారిఫ్ విధించమని ట్రంప్ హామీ ఇచ్చారు.
మేలో జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. దీంతో చైనా ఉత్పత్తులపై టారిఫ్ పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. తాజా నిర్ణయంతో టారిఫ్ పెంపు నిలిచినట్లే. వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభించడానికి అమెరికా అంగీకరించిందని చైనా మీడియా పేర్కొంది. అయితే అమెరికా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చైనాతో తమకు శత్రుత్వం లేదని, వాషింగ్టన్ - బీజింగ్ మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పినట్లు చైనా అధికార పత్రిక చైనా డైలీ పేర్కొంది. వాణిజ్య లోటుపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల కమిటీలు త్వరలో సమావేశమవుతాయని తెలిపింది.
ఇద్దరు దేశాధినేతల భేటీ సందర్భంగా.. చైనాతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నామని, అందుకు చైనా కూడా సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని, ఘర్షణ వల్ల ఇరు దేశాలకు నష్టమన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సైతం అమెరికాతో మెరుగైన సంబంధాల దిశగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరస్పరం సహకరించుకుంటే అమెరికా-చైనా లబ్ధి పొందుతాయని, గొడవలకు దిగితే ఇరుపక్షాలూ నష్టపోతాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు.
గతంలో ఇరువురి భేటీ రద్దయిన అనంతరం ట్రంప్ పలుమార్లు చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25 శాతం పన్ను విధించారు. దీంతో చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై పన్ను విధించింది. చైనా మొబైల్ కంపెనీ హువావేపై కఠిన చర్యలకు కూడా ట్రంప్ ప్రభుత్వం సిద్ధపడింది. 2018 జూన్ నెలలో ప్రారంభమైన ట్రేడ్ వార్.. ఏడాది తర్వాత ఇప్పుడు తాత్కాలికంగా ముగిసిపోయింది.


Click it and Unblock the Notifications