అనిల్ అంబానీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అప్పులు, కష్టాలతో పాటు ఎన్నో సమస్యల సుడిగుండంలో చిక్కుకున ఆయన.. మరో ఇబ్బందిని కోరి తెచ్చుకున్నారు. ఉన్న సమస్యలు చాలవన్నట్టు కొత్త జంజాటాన్ని నెత్తినేసుకున్నారు. కొరివితో తలగోక్కునేట్టు కనిపిస్తోంది ప్రస్తుత స్థితి చూస్తుంటే. వివరాల్లోకి వెళ్తే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు మహారాష్ట్రలోని వెర్సోవా - బాంద్రా సీ లింక్ ప్రాజెక్ట్ దక్కింది. వాస్తవానికి ఇది గుడ్ న్యూస్ అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఇది ఇబ్బందికర పరిణామమే.'

అంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలరా ?
ముంబైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం రూ.7000 కోట్లతో ఈ సముద్ర లింక్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీనికి నిర్దిష్టమైన సమయాన్ని విధించింది. ఈ లోపును ఖచ్చితంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిశ్చయించుకుంది. వివిధ కంపెనీలు వేసిన బిడ్‌లో అదృష్టమో.. దురదృష్టమో అనిల్ అంబానీ సంస్థ ప్రాజెక్ట్ దక్కించుకుంది.
ప్రాజెక్ట్ దక్కించుకోవడం మంచి విషయమే కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సదరు సంస్థ అంత పెద్ద ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టును నిర్మించే సత్తాను కలిగి ఉందా లేదా అనే ప్రశ్న. ఎందుకంటే వివిధ రేటింగ్ ఏజెన్సీలు ఈ కంపెనీని డౌన్ గ్రేడ్ చేశాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థ గతేడాది చివరి క్వార్టర్‌లో ఎప్పుడూ ప్రకటించనంత నష్టాన్ని మూటగట్టుకుంది. సంస్థ మనుగడపై ఆడిటర్లు కూడా అనుమానాన్ని వ్యక్తం చేయడం మరింత ఆందోళనకర పరిణామం.

ఎందుకు ఇబ్బంది అంటే..
రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు క్యాష్ ఫ్లోస్ ఏ మాత్రం లేవు. అప్పు పేరుకుపోయింది. కొత్త అప్పు పుట్టడం కష్టంగా ఉంది. అలాంటి తరుణంలో 60 నెలల్లోపు ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఒక వేళ అది పూర్తి చేయని పక్షంలో భారీ పెనాల్టీలను విధిస్తామని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చెబ్తోంది. ప్రతీ రోజూ అక్కడ జరుగుతున్న పనులను సమీక్షిస్తామని, నిర్దేశించిన సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందేనని, ఆరు నెలలకు ఓ సారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి నిధులను విడుదల చేస్తామని కార్పొరేషన్ అధికారులు చెబ్తున్నారు.

ప్రాజెక్టుకు ఎందుకంత ప్రాధాన్యత
ముంబైకి ఈ ప్రాజెక్ట్ ఎందుకు ముఖ్యమంటే.. ఇది వర్సోవా సబర్బన్ నుంచి బంద్రాకు వెళ్లే సమయాన్ని 90 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గిస్తుంది. 2012లోనే దీన్ని నిర్మించాలని అనుకున్నా వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఇప్పుడు ఇటలీకి చెందిన అస్తాల్దీ సంస్థతో కలిసి రిలయన్స్ ఇన్ఫ్రా ఈ బృహత్తర ప్రాజెక్టును చేపడ్తోంది.
చివరగా..
ఇప్పుడున్న పరిస్థితుల్లో అనిల్ అంబానీ సంస్థ మరింత పట్టుదలతో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది. లేకపోతే అధిక సమస్యలను కొని తెచ్చుకున్నట్టవుతుంది.


Click it and Unblock the Notifications