పెట్టుబడుల పరిమితి పెంపుతో భారతీయుల 'అమెరికా' కలలు గల్లంతు
జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్లాలన్నది ఎంతో మంది కల. అక్కడకు వెళ్లి చదువుకోవడమే కాకుండా ఉద్యోగం సంపాదించి స్థిర పడాలన్నది మరి కొందరి జీవిత కాల కోరిక. గ్రీన్ కార్డు సంపాదించాలన్నది ఇంకొందరి ప్రధాన లక్ష్యం. అయితే అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయినప్పటి నుంచి భారతీయుల అమెరికా కలలు ఒక్కొక్కటిగా చెదిరి పోతున్నాయి. అగ్రరాజ్యం వెళ్ళడానికి అవకాశం కల్పించే వీసాలపై ఆంక్షలు విధించడం వల్ల ఎంతో మందికి అమెరికా అందని ద్రాక్షలా మారిపోతోంది. అమెరికా గ్రీన్ కార్డు పొందడానికి అవకాశం లేని భారత సంపన్నులు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా అమెరికా కలను సాకారం చేసుకోవడానికి ఇంతకాలం ఈబీ5 వీసా దోహదపడింది. అయితే ఇప్పుడు ఇది కూడా అందనంతగా మారిపోతోంది. ఈ వీసా పొందడానికి గాను అవసరమైన పెట్టుబడి మొత్తాన్ని అమెరికా రెండింతలకు పైగా పెంచివేసింది. ఈ నేపథ్యంలో భారతీయుల అమెరికా కలలు గల్లంతు అవుతున్నాయి.

ఏమిటీ ఈబీ5..
అమెరికాలో పెట్టుబడి పెట్టి గ్రీన్ కార్డును పొందడానికి అవకాశం కల్పించేదే ఈబీ 5 వీసా. ఈబీ 5 ఇన్వెస్ట్ మెంట్ ప్రోగ్రామ్ కింద అమెరికాలోని రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే కొంతకాలం తర్వాత పెట్టుబడిగా పెట్టిన సొమ్మును తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డును పొందిన ఇన్వెస్టర్లు అమెరికాలో ఇతర పనులు చేసుకోవచ్చు. అమెరికా ఇతర దేశస్తులకు వార్షికంగా 10,000 ఈబీ5 వీసాలను మాత్రమే జారీ చేస్తోంది. ప్రతి దేశానికి గరిష్టంగా 700 వీసాలను కేటాయిస్తారు. వీటిని ఉపయోగించుకొని అగ్ర రాజ్యంలో అనేక మంది పెట్టుబడులు పెట్టి అక్కడే స్థిరపడి పోతున్నారు.

ఇప్పుడేం జరిగింది..
ఇప్పటిదాకా ఈబీ 5 కింద కనీసంగా అమెరికాలో వ్యాపారం కోసం పెట్టాల్సిన పెట్టుబడి మొత్తం 5 లక్షల డాలర్లు ఉండేది. దీన్ని 13.5 లక్షల డాలర్లకు పెంచారు. అంటే రెండింతలకు పైగా పెరిగిందన్నమాట. వచ్చే అక్టోబర్ నుంచి ఈ మార్పులు అమల్లోకి తీసుకు రావాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల భారతీయులపై ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీ కోసం దరఖాస్తులు 80-90 శాతం వరకు తగ్గ వచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా దేశీయంగా భారత రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా కొన్ని ఒత్తిడులు రావచ్చని భావిస్తున్నారు. విదేశాలకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తరలిపోయే పరిస్థితి ఏర్పడితే ఆర్బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇతర దేశాలతో పోల్చితే తక్కువ
పెట్టుబడులు పెట్టి ఆయా దేశాల్లో నివాసం ఉండటానికి వివిధ దేశాలు నిర్ణయించిన పెట్టుబడి పరిమితికన్నా అమెరికాలో ఉన్న పరిమితి చాలా తక్కువగా ఉన్నట్టు అమెరికా ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కెనడాలో పెట్టుబడి మొత్తం 10 లక్షల డాలర్లు, ఆస్ట్రేలియాలో 40 లక్షల డాలర్లు, యూకేలో 20 లక్షల డాలర్లుగా ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొనే అమెరికా పెట్టుబడి పరిమితి మొత్తాన్ని పెంచినట్టు తెలుస్తోంది.

ఆశలకు గండి
ఇప్పటికే చాలా మంది భారతీయులు అమెరికాలో కంపెనీలు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా బిజినెస్ లు ప్రారంభించాలని మరింత మంది ఆశిస్తున్నారు. చాలా మంది అమెరికాలోనే స్థిర పడాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకువస్తున్న విధానపరమైన మార్పుల వల్ల అనేక మంది ఆశలకు గండి పడుతోంది.


Click it and Unblock the Notifications