ఏపీలో ఎన్నికల ఖర్చు వింటే షాకవ్వాల్సిందే: అధిక ఖర్చు ఈ నియోజకవర్గాల్లోనే...
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వ్యంయ రూ.55వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్ల వరకు ఉందని సెంటర్ ఫర్ మీడియాస్టడీస్ (CMS) వెల్లడించింది. 2014 లోకసభ ఎన్నికలతో పోలిస్తే ఇది రెండింతలు అని చెప్పింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేశారని, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోను భారీగా నగదు ప్రవాహం కనిపించిందని తెలిపింది. దేశవ్యాప్తంగా రూ.12వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు నేరుగా ఓటర్లకు పంపిణీ చేసినట్లు తెలిపింది.

రూ.40 కోట్ల ఖర్చు పెట్టిన తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాలు
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కలిపి రూ.5,400 కోట్లు (అసెంబ్లీ ఎన్నికలకు రూ.5,000, 16 లోకసభ స్థానాలకు రూ.400 కోట్లు) ఖర్చు అయితే, ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే రూ.7వేల కోట్ల నుంచి రూ.9వేల కోట్లకు పైగా ఆయా పార్టీలు, అభ్యర్థులు ఖర్చు చేసినట్లు CMS వివరించింది. 2019 ఎన్నికల్లో ఖర్చుపై CMS నివేదికను విడుదల చేసింది. దేశంలో 75 నుంచి 85 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఖర్చు చేశారని, తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లో రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు పేర్కొంది. తెలంగాణలోని నల్గొండ, చేవెళ్ల, మల్కాజిగిరి, ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప, అనంతపురం నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు పేర్కొంది.

ఏపీలో ఓటుకు రూ.7వేలు
ఏపీలో అధికార, విపక్ష పార్టీలు ఓటర్లకు భారీగా నగదును పంపిణీ చేశాయని, ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చిందని CMS నివేదిక వెల్లడించింది. ఓ నియోజకవర్గంలో ఓటుకు రూ.2వేలు ఇస్తే మరో నియోజకవర్గంలో రూ.7వేలు ఇచ్చినట్లు పేర్కొంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సగానికి పైగా ఓటర్లకు సగటున రూ.1,000 నుంచి రూ.2,000 వరకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎక్కువ శాతం మంది కోటీశ్వరులు పోటీ చేశారని, దీంతో ఎక్కువ శాతం నగదు ప్రవాహం జరిగిందని పేర్కొన్నారు.

ఎన్నికల ఖర్చు పెరిగిన కొద్దీ... ప్రాథమిక సేవలపై ఖర్చు
ఎన్నికల ఖర్చు పెరుగుతున్న కొద్దీ భారత్‌లో కరప్షన్ పెరుగుతోందని CMS ప్రతినిధులు అన్నారు. సర్వే ప్రకారం సాధారణ పౌరులు 18 ప్రాథమిక సేవల పైన ఏడాదికి రూ.30,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని, కానీ ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని వారు వెల్లడించారు. ఎన్నికల ఖర్చు ఎలా పెరుగుతోందో అవినీతి అలా పెరుగుతోందన్నారు.


Click it and Unblock the Notifications